Thursday, September 19, 2024
HomeUncategorizedబీహార్‌లో రెండు భాగాలుగా విడిపోయిన రైలు

బీహార్‌లో రెండు భాగాలుగా విడిపోయిన రైలు

Date:

ఢిల్లీ నుంచి ఇస్లాంపుర్‌ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు ట్వినిగంజ్‌- రఘునాథ్‌పుర్‌ రైల్వే స్టేషన్ల మధ్య రెండు భాగాలుగా విడిపోవడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఆదివారం ఉదయం 11.08గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని.. ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో వెనుక నుంచి ఎలాంటి రైళ్లు రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. బిహార్‌లోని బక్సర్‌ సమీపంలో ఈ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనపై తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో మాట్లాడుతూ.. ”దిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్లే మగధ్‌ ఎక్స్‌ప్రెస్ (20802) రైలు కోచ్‌ల మధ్య కప్లింగ్‌ విడిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్‌ రైలు ట్వినిగంజ్‌ దాటిన తర్వాత ఎస్‌ 6, ఎస్‌ 7 బోగీల మధ్య కప్లింగ్‌ తెగిపోవడంతో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ, సాంకేతిక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని మరమ్మతులు చేశాయి. ఈ మధ్యాహ్నం 2.25గంటలకు రైలుకు మరమ్మతులు పూర్తవ్వడంతో రైలు బయల్దేరింది. ఆ తర్వాత ఈ మార్గంలో మిగతా రైళ్లనూ అనుమతించాం. ఈ ప్రమాదంతో దాదాపు మూడు గంటలకు పైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకొనేందుకు దర్యాప్తును ఆదేశించాం’ అని తెలిపారు.