హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాముడి వేషధారణలో ఉన్న ఓ బాలుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నమస్కరించారు. కర్నల్ నగరంలోని మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. సీఎం ఖట్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కొందరు చిన్నారులు రాముడు, సీత, లక్ష్మణుడిగా వేషాలు ధరించి ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శన అనంతరం సీఎం ఖట్టర్ నేరుగా ఆ చిన్నారుల వద్దకు వెళ్లి.. రాముడి వేషధారణలో ఉన్న చిన్నారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.