Wednesday, October 2, 2024
HomeUncategorizedబయట యూపీఎస్సీ పరీక్షలు రాసే వారికి మూడు వేలు ఇవ్వండి

బయట యూపీఎస్సీ పరీక్షలు రాసే వారికి మూడు వేలు ఇవ్వండి

Date:

మణిపూర్‌ వెలుపల యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యే వారికి రోజుకు మూడు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 26న యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ జరుగనున్నది. అయితే అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో మణిపూర్‌ అట్టుడిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మణిపూర్ వెలుపల పరీక్షా కేంద్రాలను మార్చాలని, రవాణా సౌకర్యం కల్పించాలని కోరుతూ 140 మంది అభ్యర్థులు తొలుత ఢిల్లీ హైకోర్టును ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మణిపూర్‌లోని కొండ జిల్లాల అభ్యర్థులు ఎంచుకున్న ఇంఫాల్‌ పరీక్షా కేంద్రాన్ని మార్చడానికి అనుమతిస్తామని మార్చి 29న ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అలాగే వారికి ప్రయాణ ఏర్పాట్లు చేయడంతోపాటు ఖర్చుల నిమిత్తం రోజుకు రూ.1500 చొప్పున భత్యం ఇవ్వాలని మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు మణిపూర్‌ వెలుపల పరీక్షా కేంద్రాలు ఎంచుకున్న, మార్చుకున్న అభ్యర్థుల పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. అభ్యర్థులకు రవాణా ఏర్పాట్లు చేయాలన్న హైకోర్టు ఆదేశం ఆచరణాత్మకం కాదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు సూచించిన రోజువారీ భత్యాన్ని రూ. 1,500 నుంచి రూ.3,000కు సుప్రీంకోర్టు పెంచింది. ఈ ప్రయోజనం పొందాలనుకునే మణిపూర్‌ అభ్యర్థులు ఈమెయిల్‌ ద్వారా వారి చిరునామా పరిధిలోని నోడల్ అధికారిని సంప్రదించాలని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.