Tuesday, October 8, 2024
HomeUncategorizedబడ్జెట్‌లో తెలంగాణ పేరే ఎత్తలేదు

బడ్జెట్‌లో తెలంగాణ పేరే ఎత్తలేదు

Date:

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై ఆయన స్పందిస్తూ బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారని మండిపడ్డారు. ”మా ప్రభుత్వంలోని మంత్రులు 18 సార్లు ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణకు అవసరమైన నిధులు ఇవ్వాలని స్వయంగా నేను ప్రధానికి విజ్ఞప్తి చేశా. కానీ, తెలంగాణ పదం పలకడానికి కేంద్రం ఇష్టపడటం లేదు. మొదటి నుంచి ప్రధాని మోడీ తెలంగాణ పట్ల కక్ష కట్టారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఏ రంగానికీ సహకారం అందించలేదు. వికసిత్‌ భారత్‌లో తెలంగాణ భాగం కాదని ప్రధాని అనుకుంటున్నారు.

కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలి

బడ్జెట్‌లో బిహార్‌, ఏపీని మాత్రమే పట్టించుకున్నారు. ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదు. 8 సీట్లు ఇచ్చి తెలంగాణ ప్రజలు భాజపా పట్ల వివక్ష చూపలేదు. 8 సీట్లు ఇవ్వడం వల్లే మోదీ ప్రధాని కుర్చీలో ఉన్నారు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేమని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లేఖ రాశారు. అలాంటప్పుడు కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ఎందుకు కొనసాగుతున్నారు? కేంద్రమంత్రి పదవి కోసం కిషన్‌రెడ్డి.. తెలంగాణ హక్కులను మోదీ వద్ద తాకట్టుపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్‌రెడ్డి బాధ్యత వహించాలి. కేంద్ర వైఖరికి నిరసనగా కేంద్రమంత్రి వర్గం నుంచి రాజీనామా చేసి బయటకు రావాలి.