Sunday, December 22, 2024
HomeUncategorizedఫిబ్రవరి చివరిలో రైతు భరోసా వేస్తాం

ఫిబ్రవరి చివరిలో రైతు భరోసా వేస్తాం

Date:

కార్యకర్తల కష్టంతో రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని, రాహుల్ జోడో యాత్రతో మూడు రాష్ట్రాల్లో పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. తన ప్రభుత్వం ఏర్పడి ఇంకా 50 రోజులు కాలేదన్నారు. కానీ, తమ పాలనలో ఏమీ చేయలేని వారు ఇప్పుడు ప్రభుత్వం దుష్ప్రచారం ప్రారంభించారని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని గత పాలకులు తీసుకొచ్చారని విమర్శించారు. సోనియా, రాహుల్ ను వేధించేందుకే ప్రధాని మోడీ ఈడీ, సీబీఐ కేసులు పెడుతున్నారని రేవంత్ ఆరోపించారు.

రేవంత్ ను గుంపు మేస్త్రీ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పైన రేవంత్ స్పందించారు. మేస్త్రినే అని, మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మాణం చేస్తున్న మేస్త్రినంటూ బీఆర్ఎస్‌పై ధ్వజమెత్తారు. మిమ్మల్ని ఘోరీ కట్టే మేస్త్రిని కూడా తానేనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి ప్రణాళికా బద్దంగా నియోజకవర్గాల్లో పర్యటనలు ఉంటాయని వెల్లడించారు. ఈ నెలలోనే తాను ఇంద్రవల్లి వస్తానని రేవంత్ చెప్పుకొచ్చారు. కాస్కోవాలని సవాల్ చేసారు. తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు కేసీఆర్ రాజ్యసభ సభ్యులను చేశారని.. రూ. 50 వేలు కూడా లేకున్నా 52 వేల మెజార్టీతో గెలుపొందిన మందుల శామ్యూల్‌కి తాము టికెట్ ఇచ్చామని ఆయన చెప్పారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసామని చెప్పారు. వచ్చే నెల తొలి వారంలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామని రేవంత్ ప్రకటించారు. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ హామీ అమలు దిశగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మరో నిర్ణయం పైన కసరత్తు జరుగుతోంది. ఇక, ఫిబ్రవరి చివరి వరకు రైతు భరోసాలో భాగంగా రైతుల ఖాతాల్లో నగదు వేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ దయ వల్లే తాను ముఖ్యమంత్రినయ్యానని పేర్కొన్నారు. మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉండటంతో..ఈ లోగానే గ్యారంటీల అమలు పైన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.