Sunday, September 22, 2024
HomeUncategorizedప్ర‌శ్న‌లు అడ‌గండి.. క‌థ‌లు చెప్ప‌డానికి కాదు..

ప్ర‌శ్న‌లు అడ‌గండి.. క‌థ‌లు చెప్ప‌డానికి కాదు..

Date:

లోక్‌స‌భ‌లో అడగాలనుకున్న విషయాలు నేరుగా అడగాలని, కథలు చెప్పవద్దని శుక్రవారం స్పీకర్‌ ఓం బిర్లా ఓ ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఒడిశాకు చెందిన భాజపా సభ్యుడు ప్రదీప్‌ పురోహిత్‌ కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కళాశాల గురించి ప్రశ్నిస్తూ, అక్కడి మూలికల చరిత్ర గురించి ప్రస్తావించారు. దీంతో స్పీకర్‌ ”మీరు మహాభారత కథలు చెప్పకండి.. ప్రశ్నలే అడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషనైపోయింది” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ చక్రవ్యూహం గురించి ప్రస్తావించారు. ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని ‘పద్మవ్యూహం’లోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశమని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. దేశాన్ని బంధించిన చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయన్నారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను శాఖ రెండోదని తెలిపారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్‌ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

బిజెపికి చెందిన అనురాగ్‌ ఠాకూర్‌ రాహుల్‌ గాంధీపై ఎదురు దాడికి దిగారు. ”కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు దేశంపై అనేక చక్ర వ్యూహాలు వేసింది. మొదటిది దేశ విభజన, రెండోది చైనాకు బహుమతి, మూడోది ఎమర్జెన్సీ విధింపు, నాల్గోది బోఫోర్స్‌ కుంభకోణం, సిక్కు అల్లర్లు, ఐదోది సనాతన మతానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం, ఆరోది దేశ సంస్కృతీ సంప్రదాయాలను దెబ్బ తీయడం..ఈ చక్ర వ్యూహం నుంచి దేశాన్ని మోదీ బయటకు తీశారు” అంటూ విమర్శలు గుప్పించారు.