Friday, September 20, 2024
HomeUncategorizedప్రభుత్వ సహాయం కోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు

ప్రభుత్వ సహాయం కోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు

Date:

ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం కొంతమంది యువతులు ఎదురుగా వరుడు లేకుండానే తమ మెడల్లో తామే వరమాలలు వేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జరిగింది. వారు ఎందుకిలా చేశారో తెలుసుకుంటే విస్తుపోవాల్సిందే. పేదల పెళ్లిళ్ల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాల యువతీ యువకులకు ఆర్థికసాయం కింద రూ.51,000 అందజేస్తోంది. అక్రమంగా లబ్ధి పొందాలనే దురాశతో కొందరు అధికారులు దళారులతో చేతులు కలిపారు.

ఆ మేరకు జనవరి 25న మనియర్‌ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లిళ్ల కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకువచ్చారు. పెళ్లి కాని, పెళ్లయిన యువతీ యువకులకు డబ్బు ఎర చూపారు. ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారడంతో పోలీసులు 8 మంది అధికారులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరికీ నిధులను విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్‌ తెలిపారు.