Wednesday, September 25, 2024
HomeUncategorizedప్రతి మహిళకు, ప్రతినెలా 1,000 రూపాయలు

ప్రతి మహిళకు, ప్రతినెలా 1,000 రూపాయలు

Date:

దేశంలో లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే.. తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. ఈ మేనిఫెస్టోను డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఉదయం చెన్నైలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో విడుదల చేశారు. ఇది తమ పార్టీ మేనిఫెస్టో కాదని, ప్రజల సంక్షేమాభివృద్ధికి సంబంధించినదిగా అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో జాతీయ భావాలకు ఓటు వేయాలని, మత రాజకీయాలను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. మతం పేరుతో జనం మధ్య చిచ్చు పెట్టడాన్ని సహించబోమని అన్నారు.

డీఎంకే మేనిఫెస్టోలో- జాతీయ పౌరసత్వ సవరణ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేయకపోవడం, రాజ్యాంగ, ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తిని కాపాడటం, నూతన విద్యా విధానంతో పాటు నీట్‌ ఉపసంహరణ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించడం, దక్షిణాది రాష్ట్రాల వారికి ప్రయోజనకారిగా ఉండేలా చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు వంటివి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ప్రతి మహిళకూ ప్రతినెలా 1,000 రూపాయల ఆర్థిక సహాయం. ప్రస్తుతం ఇది తమిళనాడులో అమలవుతోంది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు, అన్ని టోల్‌ గేట్ల రద్దు, గవర్నర్ అదనపు అధికారాలను బదలాయించడానికి ఉద్దేశించిన ఆర్టికల్ 361 తొలగింపు వంటి హామీలను డీఎంకే ఇచ్చింది.

ఒకే దేశం, ఒకే ఎన్నిక వ్యవస్థను వ్యతిరేకిస్తామని డీఎంకే ఈ మేనిఫెస్టో ద్వారా స్పష్టం చేసింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తామనీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలను తమిళంలో కూడా రాసేలా చర్యలు తీసుకోవడం, శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం కల్పించడం, 500 రూపాయలకే వంటగ్యాస్ సరఫరా, లీటర్ పెట్రోల్- 75 రూపాయలు, లీటర్ డీజిల్- 65 రూపాయలకు విక్రయించేలా తక్షణ చర్యలను తీసుకుంటామని డీఎంకే తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది.