Sunday, October 6, 2024
HomeUncategorizedప్రజాభవన్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

ప్రజాభవన్‌లో చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ

Date:

హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం సాయంత్రం ముఖాముఖి భేటీ అయ్యారు. తొలుత ప్రజాభవన్‌కు చేరుకున్న చంద్రబాబుకు.. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. కాళోజీ రచించిన ‘నా గొడవ’ పుస్తకాన్ని చంద్రబాబుకు బహూకరించారు. అనంతరం భేటీ అయి.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల సమావేశం వేదికైంది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.

హైదరాబాద్‌లో సమావేశమై రెండు సమస్యలను పరిష్కరించుకుందామని, సహకరించుకుంటూ ముందుకు సాగేందుకు ఈ భేటీ ఉపకరిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించడంతో శనివారం ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నీరబ్‌కుమార్‌ ప్రసాద్, శాంతికుమారి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి బి.సి.జనార్దన్‌రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ , ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్‌ కుమార్‌తో పాటు ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.

ఎజెండాలోని అంశాలివే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ జరిగి పదేళ్లు అయింది. అప్పటి నుంచి కీలకాంశాలు ఎన్నో పెండింగ్‌లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా ఉమ్మడిగా ఎజెండా అంశాలను ఖరారు చేశారు.