Saturday, September 21, 2024
HomeUncategorizedపోలీసు అధికారులను చూస్తుంటే జాలేస్తుంది

పోలీసు అధికారులను చూస్తుంటే జాలేస్తుంది

Date:

ఢిల్లీ పోలీస్ అధికారులు రాజకీయ నేతలు ఆడమన్నట్లుగా ఆడుతున్నారని.. ఇది వారికెంతో అవమానకరమని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. ‘ఆ అధికారులను చూస్తుంటే జాలేస్తుంది. మహిళలకు రక్షణ కల్పించి, నేరాల్ని నియంత్రించాలన్న ఆదర్శంతో యువ అధికారులు పోలీసుశాఖలో చేరారు. కానీ, ఇలాంటి రాజకీయ క్రీడల్లో భాగం కావాల్సివస్తుందని వాళ్లు ఎప్పుడూ అనుకోని ఉండరు. ఇందుకోసమే వాళ్లు పోలీసులుగా చేరారా? అందుకు బాధపడాలి. ఇలాంటి అవమానాలకు కారణం రాజకీయ పెద్దలే’ అన్నారు. తమ ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు గురిచేస్తోందంటూ చేసిన ఆరోపణలపై ఢిల్లీ క్రైం బ్రాంచి పోలీసులు ఇచ్చిన నోటీసులో ఎఫ్‌ఐఆర్‌ ప్రస్తావన లేదని, ఇలాంటి నాటకాల వల్ల దేశం అభివృద్ధి చెందలేదన్నారు.

ఆప్‌ ఎమ్మెల్యేలను బిజెపి ప్రలోభాలకు గురిచేస్తోందన్న ఆరోపణలపై శనివారం కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు.. నిన్న ఆప్‌ మంత్రి అతిషీ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. ఆప్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ఎవరు ప్రయత్నించారని తమను అడుగుతున్నారని.. వారిని ఎవరు పంపుతున్నారో వాళ్లేనన్నారు. ఇటీవల ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ అరెస్టు వ్యవహారంపైనా కేజ్రీవాల్‌ స్పందించారు. ఒక సిట్టింగ్‌ సీఎంను అరెస్టుచేయడం తప్పన్నారు. దేశంలో ప్రభుత్వాలను ఏ పార్టీ కూల్చుతుందో, పార్టీలను చీల్చుతుందో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. ఝార్ఖండ్‌ ప్రభుత్వం పడిపోతుందేమోనని 48 గంటల పాటు వేచి చూశారని.. కానీ జేఎంఎం ఎమ్మెల్యేల్లో చీలికరాలేదన్నారు. దేశంలో ఇలాంటి జరుగుతున్న ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.