Saturday, September 28, 2024
HomeUncategorizedపోలీసుల శరీరంపై టాటూలు అవమానకరం

పోలీసుల శరీరంపై టాటూలు అవమానకరం

Date:

చాలా మంది పోలీసుల శరీరాలపై టాటూలు ఉన్నాయని, పోలీసుల శరీరంపై టాటూలు అవమానకరమని, యూనిఫాం బయట కనిపించే పచ్చబొట్లను 15 రోజుల్లో తొలగించాలని పోలీస్ శాఖ ఆదేశించింది. పోలీస్‌ సిబ్బందిలో మర్యాద, సమగ్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఒడిశా పోలీస్‌ శాఖ ఈ మేరకు పోలీస్‌ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. భువనేశ్వర్, కటక్‌ పరిధిలోని జంట నగరాల కమిషనరేట్లకు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ) ఈ లేఖ జారీ చేసింది.

చాలా మంది పోలీస్‌ సిబ్బంది శరీరాలపై టాటూలున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ‘ఒడిశా పోలీసులు, బెటాలియన్‌ ప్రతిష్టను ఇది దిగజార్చుతోంది. పచ్చబొట్లతో అసభ్యకరంగా, అభ్యంతరకరంగా కనిపిస్తున్నారు. ఈ అంశాన్ని పరిశీలించిన తర్వాత టాటూలను తొలగించాలని నిర్ణయించాం. యూనిఫాం ధరించినప్పుడు కనిపించే టాటూలను అనుమతించబోం’ అని ఆర్డర్‌ జారీ చేశారు. మరోవైపు శరీరంపై టాటూలున్న పోలీసుల జాబితాలను సిద్ధం చేయాలని, 15 రోజుల్లో ఆదేశాలు పాటించేలా చర్యలు చేపట్టాలని ఒడిశా పోలీస్‌ శాఖ ఆదేశించింది. అలాగే నిర్ణీత గడువులోగా టాటూలు తొలగించడంలో పోలీసులు విఫలమైతే, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించింది. ముఖం, మెడ, చేతులు వంటి కనిపించే శరీర భాగాలపై టాటూలు వేయించుకోవద్దని పోలీసులకు సూచించింది.