Thursday, September 19, 2024
HomeUncategorizedపోటీ చేసి ఓడిపోవడంలో ఆయన రికార్డు

పోటీ చేసి ఓడిపోవడంలో ఆయన రికార్డు

Date:

గత 35ఏళ్లుగా ”గెలుపెరగని యోధుడి”గా తమిళనాడుకు చెందిన కే పద్మరాజన్ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్రపతి, ఎంపీ, ఎమ్మెల్యే మొదలుకొని స్థానిక సంస్థల్లో పోటీ చేసి ఓడిపోయి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటమి అభ్యర్థిగా రికార్డ్ క్రియేట్ చేశారు. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమయ్యారు. 65 ఏళ్ల పద్మరాజన్ 1988 నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులోని ధర్మపురి జిల్లా నుంచి పోటీకి సిద్ధమయ్యారు.

ప్రధాని నరేంద్రమోడీతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, రాహుల్ గాంధీ వంటి రాజకీయ దిగ్గజాలపై పోటీ చేసిన చరిత్ర పద్మరాజన్‌కి ఉంది. ”ఎలక్షన్ కింగ్”గా పేర్కొన్న ఆయన గెలుపొందడం తన ఉద్దేశం కాదని, ఎన్నికల్లో పోటీ చేయడమే తన విజయమని, మళ్లీ ఓడిపోయినా సంతోషమే అని చెబుతున్నారు. టైర్ రిపేర్ షాప్ నిర్వహించే పద్మరాజన్ హోమియోపతి మందుల అమ్మకంతో పాటు స్థానికంగా ఓ మీడియాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

ఇప్పటి వరకు 238 ఎన్నికల్లో ఓడిపోయిన పద్మరాజన్, ప్రతీసారి డిపాజిట్ కోల్పోయి లక్షల రూపాయల్ని కోల్పోయారు. 2011లో మెట్టూర్ అసెంబ్లీకి పోటీ చేసిన ఆయనకు ఒక్క ఆయన ఓటు తప్పితే, వేరే వారు ఓటేయలేదు. ఈ ఎన్నికల పరంపరలో అత్యధికంగా 6273 ఓట్లు సాధించారు. ఇప్పటి వరకు పోటీ చేసిన అన్ని ఎన్నికల్లో ఓడిపోయిన పద్మరాజన్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. అత్యధిక సార్లు ఓడిపోయిన అభ్యర్థిగా తన పేరు లిఖించుకున్నారు. నిజంగా తాను ఒకవేళ గెలిస్తే గుండెపోటు వస్తుందేమో అని ఆయన చమత్కరిస్తున్నారు.