Saturday, September 21, 2024
HomeUncategorizedపొత్తు లేదు.. అన్ని స్థానాల్లో పోటీ

పొత్తు లేదు.. అన్ని స్థానాల్లో పోటీ

Date:

ఇండియా కూటమికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కూటమికి గుడ్ బై చెప్పింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేయబోతోంది. మొన్నటికి మొన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఇచ్చిన షాక్ నుంచి తేరుకోకముందే ఈ సారి ఆప్ అదే బాట పట్టింది. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. చండీగఢ్‌ను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 14కు చేరుతుంది. ఈ 14 చోట్లా పోటీ చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మరో 10-15 రోజుల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు.

చండీగఢ్‌లో ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాలను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కలిసి ప్రారంభించారు అరవింద్ కేజ్రీవాల్. వాటికి పచ్చజెండా ఊపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో అత్యధికంగా 92 చోట్ల తమ అభ్యర్థులను గెలిపించారని, దీనికి రుణం తీర్చుకుంటోన్నానని చెప్పారు. ఇదే రకమైన ఆదరణ లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే చండీగఢ్‌తో కలిపి పంజాబ్‌లోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలకూ అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. ప్రజల్లో ఆదరణ ఉన్న వారికే టికెట్లను ఇస్తామని తేల్చి చెప్పారు.