కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కాగా ఈ బడ్జెట్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అభివృద్దే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళుతోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ మంత్రంతో ప్రభుత్వం సవాళ్లను ఎదుర్కొంటోందని అన్నారు. ఈ బడ్జెట్‌లో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చేశారు. బడ్జెట్ పరిమాణం మొత్తం రూ.47.66లక్షల కోట్లుగా రూపొందించారు.
బడ్జెట్ లో శాఖలు, పథకాల వారీగా కేటాయింపులు
రక్షణ శాఖ- రూ.6.2లక్షల కోట్లు
మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు
రైల్వే శాఖ- రూ.2.55లక్షల కోట్లు
హోం శాఖ- రూ.2.03లక్షల కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖ- రూ.1.77లక్షల కోట్లు
వ్యవసాయం, రైతుల సంక్షేమానికి రూ.1.27లక్షల కోట్లు
ఉపరితల రవాణా, జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.2.78లక్షలకోట్లు
రసాయనాలు, ఎరువుల కోసం రూ.1.68లక్షలకోట్లు
ఆహారం, ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.2.13లక్షల కోట్లు
కమ్యూనికేషన్ రంగానికి రూ.1.37లక్షలకోట్లు
గ్రామీణ ఉపాధిహామీ పథకానికి రూ.86వేలకోట్లు
ఆయుష్మాన్ భారత్ పథకానికి రూ.7500కోట్లు
సోలార్ విద్యుత్ గ్రిడ్‌కు రూ.8500కోట్లు
సెమీ కండక్టర్లు, డిస్‌ప్లే ఎకో వ్యవస్థల తయారీకి రూ.6,903కోట్లు
గ్రీన్ హైడ్రోజన్‌కు రూ.600కోట్లు కేటాయించారు.
బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఆర్థిక వ్యవస్థలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇది సాధ్యమైందన్నారు. ఆయన ప్రధాని అయ్యాక ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని.. వాటన్నింటినీ ఎదుర్కొని అభివృద్ధి దిశగా అడుగులు వేశామని చెప్పారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల ద్వారా 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పిన నిర్మలా సీతారామన్.. ప్రజల ఆదాయం, జీవన ప్రమాణాలతో పాటు దేశ ప్రజల వాస్తవిక ఆదాయం 50 శాతానికిపైగా పెరిగిందని చెప్పారు. యువత కోసం లక్ష కోట్ల కార్పస్ ఫండ్ క్రియేట్ చేస్తామని.. పేదలు, మహిళా సాధికారత, రైతులపై ఫోకస్ పెడతామని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆదాయ పన్ను శ్లాబులు యధాతదంగా ఉంటాయని చెప్పారు.