పశ్చిమ బెంగాల్ డార్జిలింగ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రైళ్ల ప్రమాదంలో ఇప్పటి వరకూ 15 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికిపైగా గాయపడినట్లు సమాచారం. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అస్సాంలోని సిల్చార్ నుంచి కోల్‌కతాలోని సెల్దాకు బయల్దేరిన కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలును న్యూజల్‌పాయ్ గుడి జంక్షన్ సమీపంలోని రంగపాని స్టేషన్ వద్దకు రాగానే అదే ట్రాక్‌పై వెనుకనుంచి వచ్చిన ఓ గూడ్స్ రైలు బలంగా ఢీ కొట్టింది. దీంతో కాంచన్‌జంగా రైలుకు చెందిన ఓ బోగీ గాల్లోకి లేచింది. ప్రమాద తీవ్రతకు గూడ్స్ రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు సైతం పట్టాలు తప్పాయి. ఘటనాస్థలి వద్ద చెల్లాచెదురుగా పడి ఉన్న రైలు బోగీలు చూస్తేనే తెలుస్తోంది ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో. ఈ ఘటనలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు భావిస్తున్నారు.
పలు రైళ్లు దారి మళ్లింపు..
రెండు రైళ్లు ఢీ కొట్టడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ రూట్‌లో వెళ్లే పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. మరికొన్నింటిని రద్దు చేశారు. ఘటన సమాచారం అందుకున్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. ఎన్‌ఎఫ్‌ఆర్ జోన్‌లో దురదృష్టకర ప్రమాదం జరిగిందన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు చెప్పారు. రైల్వే, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.