Sunday, September 22, 2024
HomeUncategorizedప‌దేళ్లుగా అమెరికాలో మ‌హిళ శాశ్వ‌త‌ నివాసం

ప‌దేళ్లుగా అమెరికాలో మ‌హిళ శాశ్వ‌త‌ నివాసం

Date:

గుజ‌రాత్‌కు చెందిన ఒక మ‌హిళ ప‌దేళ్లుగా అమెరికాలో యూఎస్‌ గ్రీన్‌ కార్డుతో 2013 నుంచి చికాగో రాష్ట్రంలో శాశ్వత నివాసిగా ఉంటున్నారు. అమెరికాలో ఉన్నప్పటికీ గుజరాత్‌ రాష్ట్రంలోని ఓ పాఠశాల ఉపాధ్యాయురాలిగా జీతం మాత్రం అందుకుంటున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భావనాబెన్‌ పటేల్‌ అనే మహిళ గతంలో బనస్కాంతలోని అంబాజీ నగరంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండేవారు. అయితే, 2013లో ఆమె అమెరికా వెళ్లిపోయారు. యూఎస్‌ గ్రీన్‌ కార్డుతో ప్రస్తుతం చికాగోలో శాశ్వత నివాసిగా ఉంటున్నారు.

ఇప్పటికీ ఆమె పేరు పాఠశాల జాబితాలో ఉంది. అంతేకాదు, పాఠశాల ద్వారా ఎనిమిదేళ్లుగా ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు. పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. పటేల్‌ సాధారణంగా ఏడాదికి ఒకసారి దీపావళి సందర్భంగా మాత్రం గుజరాత్‌కు వెళ్తుంటారు. ఆ సమయంలో పాఠశాలకు సెలవులు ఉంటాయి. దీంతో ఆమె పాఠశాలను సందర్శించే అవకాశం కూడా లేదు. అయినప్పటికీ ఆమె ప్రభుత్వం నుంచి జీతం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

‘2013లో పటేల్‌ అమెరికాకు మకాం మార్చారు. ఆమె పాఠశాలకు గైర్హాజరు కావడం నా దృష్టికి రావడంతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాను’ అని పాఠశాల ఇన్‌ఛార్జ్‌ టీచర్‌ పరుల్‌బెన్‌ తెలిపారు. ఇక దాదాపు రెండేళ్లుగా పటేల్‌ను చూడలేదని విద్యార్థులు పేర్కొనడం గమనార్హం. విద్యార్థులు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో విద్యా శాఖ అధికారులు విచారణ చేపట్టారు. పటేల్‌ చివరిసారిగా జనవరి 2023లో పాఠశాలను సందర్శించినట్లు గుర్తించారు. ఇక ఈ ఏడాది ఆరంభం నుంచి వేతనం లేని సెలవుల్లో ఉన్నట్లు ప్రాథమిక విద్యా శాఖ అధికారి ధృవీకరించారు.