Sunday, December 22, 2024
HomeUncategorizedనెల‌రోజుల కింద‌టే శిక్ష‌ణ‌లో చేరిన తాన్యా

నెల‌రోజుల కింద‌టే శిక్ష‌ణ‌లో చేరిన తాన్యా

Date:

చిన్న‌ప్ప‌టి నుంచి తాన్యా సోని ఐఏఎస్ కావాల‌నే ఆలోచ‌న‌తోనే ముందుకు సాగేది.. పాఠ‌శాల‌లో, క‌ళాశాల‌లో జ‌రిగే సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనేది.. తాన్యాసోనికి క‌విత్వ‌మంటే చాలా ఇష్టం.. కాని ఆమె ఆశ‌ల‌ను విధి తుడిపేసింది. వర్షం పడుతున్న రోజున లైబ్రరీలో చదువుకునేందుకు వెళ్లడమే ఆమె జీవితాన్ని బలిగొంది. సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్‌ రాజేంద్రనగర్‌లో శనివారం రాత్రి ఐఏఎస్‌ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి మృతి చెందిన ముగ్గురు విద్యార్థుల్లో తాన్యా సోని ఒకరు. బిహార్‌లోని ఔరంగాబాద్‌కు చెందిన తాన్యా.. ఉన్నత చదువుల కోసం ఢిల్లీ వెళ్లింది. పొలిటికల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి కాగానే.. ఐఏఎస్‌ కోసం ప్రిపరేషన్‌ ప్రారంభించింది. యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, సివిల్‌ సర్వెంటుగా సేవలు అందించాలనేది ఆమె చిన్ననాటి కల.

”నెల రోజుల కిందటే సివిల్స్‌ శిక్షణలో చేరింది. మా కుటుంబం రైలులో లఖ్‌నవూ వెళుతుండగా ఈ దుర్వార్త అందింది. నాగ్‌పుర్‌లో రైలు దిగి విమానంలో ఢిల్లీకి చేరుకున్నాం. తాన్యా మృతదేహంతో ఇపుడు మా స్వరాష్ట్రమైన బిహార్‌కు బయలుదేరాం” అని తాన్య తండ్రి విజయ్‌కుమార్‌ కన్నీరు మున్నీరయ్యారు. ఆయన తెలంగాణలోని మంచిర్యాలలో సింగరేణి డీజీఎంగా పనిచేస్తున్నారు.

”మా కుటుంబంలో ఆమె ఎంతో తెలివైన విద్యార్థి. అందరి కంటే చాలా చురుగ్గా ఉండేది. కవిత్వమంటే ఆమెకు చాలా ఇష్టం. డ్యాన్స్‌పై ఎంతో ఆసక్తి ఉంది. ఆమెకు మంచి భవిష్యత్‌ ఉందనుకున్నాం. ఇంతలోనే ఇలా జరిగిపోయింది” అని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. పది రోజుల క్రితమే ఆమె తమతో కలిసి తన బర్త్‌డే వేడుకలను నిర్వహించుకుందని తాన్య స్నేహితులు చెప్పారు. ఎంతో ఉత్సాహంగా తమ మధ్య తిరిగేదని.. ఆమె మరణ వార్తను తాము జీర్ణించుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం రాత్రి బేస్‌మెంట్‌లోని లైబ్రరీలో ఉన్న 20 మంది విద్యార్థుల్లో తాన్య ఒకరు. వరద ఒక్కసారిగా పోటెత్తడంతో వారంతా అందులో చిక్కుకు పోయారు. ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. దుర్ఘటనపై విద్యార్థులు, పలు రాజకీయ పార్టీల నేతలు మండిపడ్డారు. కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలువలకు అడ్డంగా ఉన్న అక్రమ కట్టడాలు కూల్చేందుకు బుల్డోజర్లను పంపించింది. డ్రైనేజీలను, కాలువలను ఆక్రమిస్తూ, వాటికి అడ్డంగా నిర్మించిన కట్టడాలను, పాత్‌వేలను బుల్డోజర్‌తో కూల్చివేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.