దేశంలో నూతన నేర న్యాయ చట్టాల అమలు సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారు. స్వాతంత్రం సిద్ధించిన 77 ఏండ్ల తర్విఆత మన నేర న్యాయ వ్యవస్ధ పూర్తిగా స్వదేశీగా మారిందని, ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నానని అన్నారు. భారతీయ విలువల ఆధారంగా నూతన చట్టాలు పనిచేస్తాయని చెప్పుకొచ్చారు. వలసవాద చట్టాలకు పాతరేసి భారత పార్లమెంట్‌లో రూపొందిన చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు.
దండనకు బదులు ఇప్పుడు న్యాయం అందుబాటులోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. నూతన చట్టాల అమలుతో జాప్యాలకు చెల్లుచీటీ సాధ్యమై విచారణ వేగవంతమై సత్వర న్యాయం అందుబాటులోకి వస్తుందని అన్నారు. గత చట్టాల హయాంలో కేవలం పోలీసుల హక్కులే కాపాడబడేవని, నూతన చట్టాల రాకతో బాధితులు, ఫిర్యాదుదారుల హక్కుల పరిరక్షణకు వెసులుబాటు ఏర్పడిందని చెప్పారు. ఈ క్రమంలో నూతన చట్టాల కింద దేశ రాజధాని ఢిల్లీలో తొలి కేసు నమోదయింది.