Sunday, October 6, 2024
HomeUncategorizedనిర్వాహకుల నిర్లక్ష్యమే 121మంది బలి

నిర్వాహకుల నిర్లక్ష్యమే 121మంది బలి

Date:

ఉత్తరప్రదేశ్‌ హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం విస్తృత విచారణ జరిపింది. ఆ నివేదికను మంగళవారం యూపీ ప్రభుత్వానికి సమర్పించింది. తొక్కిసలాటకు నిర్వాహకులదే బాధ్యత అని, స్థానిక యంత్రాంగం కూడా ఉదాసీనంగా వ్యవహరించిందని సిట్‌ పేర్కొంది. తొక్కిసలాట ఘటనపై ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలు, ఇతర సాక్ష్యాల ఆధారంగా.. ప్రమాదానికి ఈవెంట్‌ ఆర్గనైజర్ల నిర్వహణ వైఫల్యమే కారణమని ప్రాథమికంగా తెలిసింది. వాస్తవాలను దాచిపెట్టి నిర్వాహకులు సత్సంగ్‌ కార్యక్రమానికి అనుమతులు తీసుకున్నారు. షరతులు పాటించలేదు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలను ఆహ్వానించి.. వారికి కనీస ఏర్పాట్లు చేయలేదు. ఎలాంటి పోలీసు వెరిఫికేషన్‌ లేకుండానే వాలంటీర్లను నియమించుకున్నారు. భద్రతాపరమైన ఏర్పాట్లు కూడా లేవు. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు వారు బయటకు వెళ్లేందుకు బారికేడ్లు కూడా పెట్టలేదు. ప్రమాదం జరగ్గానే నిర్వాహకుల కమిటీలోని సభ్యులు అక్కడినుంచి పారిపోయారు” అని సిట్‌ తన నివేదికలో వెల్లడించింది.

అటు స్థానిక పోలీసులు, యంత్రాంగం కూడా ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోలేదని సిట్‌ తెలిపింది. సత్సంగ్‌ జరిగే వేదిక ప్రాంగణాన్ని తనిఖీ చేయకుండా.. కనీసం సీనియర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సబ్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌ ఆ కార్యక్రమానికి అనుమతులు ఇచ్చారని సిట్‌ తెలిపింది. సర్కిల్‌ ఆఫీసర్‌, రెవెన్యూ అధికారి, ఇన్‌స్పెక్టర్‌, ఔట్‌పోస్ట్‌ ఇన్‌ఛార్జ్‌ అందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపింది. వీరిపై చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేసింది. అయితే, ఈ ఘటనలో కుట్ర కోణాన్ని కూడా తాము కొట్టిపారేయలేమని, దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సిట్‌ అభిప్రాయపడింది. ఈ నివేదిక ఆధారంగా యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానిక సబ్‌ డిస్ట్రిక్ట్‌ మేజిస్ట్రేట్‌, సర్కిల్‌ అధికారితో పాటు మరో నలుగురిని మంగళవారం సస్పెండ్ చేసింది. 80 వేల మంది భక్తులు హాజరవుతారని నిర్వాహకులు పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. అయితే 2.5 లక్షలకు పైగా ప్రజలు వచ్చినట్లు తేలింది. భోలే బాబా వెళ్తుండగా ఆయన దర్శనం కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగి 121 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటివరకు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు.