Thursday, October 3, 2024
HomeUncategorizedనితీష్ పార్టీ నుంచి బిజెపికి అప్పుడే డిమాండ్లు

నితీష్ పార్టీ నుంచి బిజెపికి అప్పుడే డిమాండ్లు

Date:

కేంద్రంలో టిడిపి, జేడీయూ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్న బిజెపి ప్రభుత్వానికి నితీశ్‌ పార్టీ నుంచి అప్పుడే డిమాండ్లు మొదలయ్యాయి. అగ్నిపథ్‌ స్కీమ్‌ను సమీక్షించాలని ఆ పార్టీ సీనియర్‌ నేత కేసీ త్యాగి ఓ టీవీ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అగ్నిపథ్‌ స్కీమ్‌ గురించి పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని కేసీ త్యాగి అన్నారు. ఈ స్కీమ్‌ను చాలామంది వ్యతిరేకించారని, ఎన్నికల్లోనూ దాని ప్రభావం పడిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వంతో తాము ఘర్షణ పడాలనుకుకోవడం లేదని పేర్కొంటూనే.. ఈ స్కీమ్‌ను తీసుకొచ్చినప్పుడే సాయుధ దళాలకు చెందిన కుటుంబాలు వ్యతిరేకించిన విషయాన్ని ప్రస్తావించారు. ఎన్నికల వేళ ఆయా కుటుంబాలు నిరసనలు తెలియజేశారని గుర్తు చేశారు. కాబట్టి దీనిపై చర్చించాల్సిన అవసరం ఉందని త్యాగి అన్నారు. దీంతో పాటు బిహార్‌కు ప్రత్యేక హోదా, దేశవ్యాప్త కులగణన వంటి అంశాలను తెరపైకి తెస్తోంది.

డిఫెన్స్‌ బిల్లును తగ్గించుకునేందుకు కేంద్రం 2022లో అగ్నిపథ్‌ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కీమ్‌ అగ్నివీర్‌లుగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికైనవారు నాలుగేళ్లపాటు పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో 25 శాతం మంది మాత్రమే మరో 15 ఏళ్లు పని చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ స్కీమ్‌ తీసుకొచ్చినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా బిహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఎన్నికల ముందు ఓ సందర్భంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా అగ్నిపథ్‌ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. పథకంలో లోటుపాట్లుంటే సరిదిద్దుతామని వ్యాఖ్యానించారు.