Saturday, September 21, 2024
HomeUncategorizedనాలుగేళ్ల బాలిక‌ల‌పై స్వీప‌ర్‌ లైంగిక వేధింపులు

నాలుగేళ్ల బాలిక‌ల‌పై స్వీప‌ర్‌ లైంగిక వేధింపులు

Date:

మహారాష్ట్రలోని బద్లాపుర్‌లోని ఒక ప్రఖ్యాత పాఠశాలలో నాలుగేళ్ల బాలికలపై ఒక స్వీపర్ లైంగిక వేధింపులకు పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనను నిరసిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళనకు దిగారు. దాంతో థానె నగరం స్తంభించింది. ఆందోళనకారులు రైల్వేట్రాక్‌లపైకి రావడంతో స్థానిక రైళ్లను నిలిపివేశారు. ఈ ఘటనలో స్వీపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బద్లాపుర్‌లోని పాఠశాలలో ఇటీవల ఈ లైంగిక వేధింపుల ఘటన జరిగింది. నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలు టాయిలెట్‌ ఉన్న సమయంలో.. దానిని శుభ్రం చేసే వంకతో ఒక స్వీపర్‌ వారివద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించాడు. ఒక బాలిక అంతర్గత అవయవాల వద్ద నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మరో బాలిక పాఠశాలకు వెళ్లాలంటే భయపడింది. వైద్యుల వద్దకు తీసుకెళ్లగా వారిపై వేధింపులు జరిగినట్లు తేలింది. దీనిపై పోలీసులను ఆశ్రయించగా.. వారిని నుంచి తొలుత స్పందన రాలేదు. చివరకు శుక్రవారం రాత్రి కేసు నమోదైంది. విచారణ అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా పాఠశాల నిర్వహణలో లొసుగులు బయటకు వచ్చాయి. బాలికల టాయిలెట్ నిర్వహణకు మహిళలను కేటాయించలేదని, ప‌లు సీసీటివీ కెమెరాలు పనిచేయడం లేదని వెల్లడైంది. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రైల్వే ట్రాక్‌లపై ఆందోళనకారుల నిరసనతో రైళ్లు నిలిచిపోయాయి. ఈ పరిణామాలపై స్పందించిన బాలల హక్కుల జాతీయ కమిషన్.. దర్యాప్తు నిమిత్తం బద్లాపుర్‌కు ఒక బృందాన్ని పంపాలని నిర్ణయించింది.