Thursday, September 19, 2024
HomeUncategorizedనాగరిక సమాజంలో ఇంకా మూఢనమ్మకాలు

నాగరిక సమాజంలో ఇంకా మూఢనమ్మకాలు

Date:

అరచేతిలో ప్రపంచాన్ని చూస్తున్నాం.. ఐనా ఇంకా నాగరిక స‌మాజంలో అనాగ‌రిక చ‌ర్య‌కు పాల్ప‌డుతున్నాం. బ్ల‌డ్ క్యాన్స‌ర్‌తో పోరాడుతున్న ఓ బాలుడిని మూఢ‌న‌మ్మ‌కానికి బ‌లి చేసింది. గంగా న‌దిలో ముంచితే క్యాన్స‌ర్ న‌య‌మ‌వుతుంద‌ని భావించిన ఓ మ‌హిళ‌.. చిన్నారిని నీటిలో కొంత‌సేపు ఉంచింది. ఆ త‌ర్వాత బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌రాఖండ్‌లోని హ‌రిద్వార్‌లో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన ఓ ఐదేండ్ల బాలుడు బ్ల‌డ్ క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాడు. దీంతో ఢిల్లీలోని పేరొందిన ఆస్ప‌త్రుల్లో బాలుడికి చికిత్స చేయించారు. కానీ క్యాన్స‌ర్ ముదిరింద‌ని, బాలుడిని ప్రాణాల‌తో కాపాడ‌టం క‌ష్ట‌మ‌ని చెప్పి డాక్ట‌ర్లు చేతులేత్తెశారు. దీంతో ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయారు.

గంగా న‌దిలో బాలుడిని ముంచితే క్యాన్స‌ర్ న‌య‌మ‌వుతుంద‌ని అత‌ని అత్త‌ న‌మ్మింది. దీంతో బాలుడితో పాటు ఆ చిన్నారి త‌ల్లిదండ్రుల‌ను తీసుకొని హ‌రిద్వార్‌కు బ‌య‌ల్దేరింది. గంగా న‌ది వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఇక త‌ల్లిదండ్రులు గంగా న‌దికి పూజ‌లు చేస్తుండ‌గా, ఆ చ‌ల్ల‌ని నీటిలో బాలుడిని అత్త ముంచింది. దాదాపు 15 నిమిషాల పాటు బాలుడు నీటిలోనే ఉండిపోయాడు.

ఈ ఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన స్థానికులు ఆమెను నిల‌దీశారు. బాలుడిని నీటిలో నుంచి పైకి తీయాల‌ని అత్త‌ను డిమాండ్ చేశారు. కానీ ఆమె వినిపించుకోలేదు. చివ‌ర‌కు స్థానికులు బ‌ల‌వంతం చేయ‌డంతో నీటిలో నుంచి బాలుడిని బ‌య‌ట‌కు తీసింది. అప్ప‌టికే అప‌స్మార‌క‌స్థితిలోకి వెళ్లిన బాలుడు.. మేల్కొంటాడ‌ని అత్త అమాయ‌కంగా మాట్లాడింది. చివ‌ర‌కు పోలీసులు అక్క‌డికి చేరుకుని, బాలుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా, అప్ప‌టికే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బాలుడికి చికిత్స అందించిన‌ ఢిల్లీ హాస్పిట‌ల్ నుంచి నివేదిక అంద‌గానే చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.