నడుస్తున్న రైలుపై మార్గమధ్యలో కొందరు ఆకతాయిలు రాళ్లు రువ్వారు. దీంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. మహారాష్ట్రలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని జల్గావ్ సమీపంలోని ఓ రైల్వే స్టేషన్ మీదుగా రైలు వెళ్తున్న సమయంలో కొందరు ఆకతాయిలు ఒక్కసారిగా రైలుపై రాళ్లు రువ్వడం ప్రారంభించారు. వారు ఆగ్రహావేశాలతో అరుస్తూ రైలుపై రాళ్ల దాడి చేశారు. ఇలా రాళ్లు విసిరిన వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లు ఎందుకు దాడి చేస్తున్నారో అర్థంకాక అయోమయంలోనే ప్రయాణికులు భయంతో కిటీకీలు, డోర్లు మూసుకున్నారు.
ఈ ఘటనను రైలులో ఉన్న వ్యక్తులు వీడియో తీసి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేశారు. అకస్మాత్తుగా రైలుపై రాళ్ల దాడి జరిగిందని, ఈ దాడికి కారణాలు తెలియదని, దీనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది మాములు సంఘటన కాదని, సమాజం యొక్క శాంతిభద్రతలను సవాలు చేసే సంఘటన అని, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని కామెంట్లు చేస్తున్నారు.