Sunday, September 22, 2024
HomeUncategorizedదేశానికి మెడ‌ల్ అందించ‌లేక‌పోయాను

దేశానికి మెడ‌ల్ అందించ‌లేక‌పోయాను

Date:

పారిస్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ ఈవెంట్‌లో తెలంగాణ అమ్మాయి నిఖ‌త్ జ‌రీన్ క‌చ్చితంగా మెడ‌ల్ కొడుతుంద‌ని భావించారు. కానీ అనూహ్యంగా ఆమె రెండో రౌండ్‌లోనే నిష్క్ర‌మించింది. బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి చేతిలో ఖంగుతిన్న‌ది. దీనిపై నిఖ‌త్ జ‌రీన్ త‌న మ‌నోవేదన వెల్ల‌డించారు. రెండు సార్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ అయిన నిఖ‌త్‌.. ఆ బౌట్‌కు ముందు రోజు రాత్రి నిద్ర‌పోలేదు. ప్రీ క్వార్ట‌ర్స్‌లో పోటీప‌డేందుకు.. ఖాళీ క‌డుపుతోనే ఆమె శిక్ష‌ణ తీసుకున్న‌ట్లు చెప్పింది. 52 కిలోల విభాగంలో చైనా క్రీడాకారిణి వూ యూ చేతిలో ఓడిపోవ‌డాన్ని నిఖ‌త్ త‌ట్టుకోలేక‌పోతున్న‌ది.

దేశానికి మెడ‌ల్ అందించ‌లేక‌పోయినందుకు జ‌రీనా సారీ చెప్పింది. ఈ స్థాయి వ‌ర‌కు వ‌చ్చేందుకు చాలా త్యాగం చేయాల్సి వ‌చ్చింద‌ని చెప్పింది. మాన‌సికంగా, శారీర‌కంగా ఒలింపిక్స్ కోసం ప్రిపేరైన‌ట్లు తెలిపింది. ఫ్యామిలీకి దూరంగా చాలా స‌మ‌యాన్ని గ‌డిపిన‌ట్లు చెప్పింది. చాలా క‌ఠిన‌మైన శిక్ష‌ణ తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. గ‌త రెండు రోజుల నుంచి తిన‌లేద‌ని, బ‌రువు మెయిన్‌టేన్ చేయాల్సి వ‌చ్చింద‌ని, క‌నీసం నీళ్లు కూడా తాగ‌లేద‌ని, వెయిట్ చెక్ చేసిన త‌ర్వాత కొన్ని నీళ్లు తాగిన‌ట్లు చెప్పిందామె. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు గంట‌ల పాటు ర‌న్నింగ్ చేసిన‌ట్లు తెలిపింది. ఒక‌వేళ మ్యాచ్ గెలిచి ఉంటే, త‌న‌ను అంద‌రూ మెచ్చుకునేవార‌ని, కానీ దీన్ని సాకుగా చూప‌లేమ‌ని, బెస్ట్‌గా ప‌ర్ఫార్మ్ చేసిన‌ట్లు నిఖ‌త్ పేర్కొన్న‌ది. ఓట‌మి జీర్ణించుకోలేక‌పోతున్న జ‌రీన్‌.. కొన్ని రోజుల పాటు సోలో ట్రిప్ వెళ్ల‌నున్న‌ట్లు చెప్పింది. రిక‌వ‌రీలో భాగంగా ఫ్యామిలీతో గ‌డ‌ప‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. వ‌త్తిడికి గురికాలేద‌ని చెప్పిన ఆమె.. కానీ మ్యాచ్ గురించే మొత్తం ఆలోచ‌న చేసిన‌ట్లు తెలిపింది. 24 గంట‌లూ ఆ మ్యాచ్ గురించే ఆలోచించాన‌ని, త‌నుకు మంచి అనుభ‌వం వ‌చ్చింద‌ని, గ‌తంలో ఆమెతో ఆడ‌లేద‌ని, ఆమె చాలా ఫాస్ట్‌గా ఉంద‌ని, ఇంటికి వెళ్లిన త‌ర్వాత ఆ బౌట్ గురించి స‌మీక్షిస్తాన‌ని నిఖ‌త్ తెలిపింది.