Thursday, October 3, 2024
HomeUncategorizedదేశంలోని 233 మంది కొత్త ఎంపీలపై కేసులు

దేశంలోని 233 మంది కొత్త ఎంపీలపై కేసులు

Date:

దేశంలో జరిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 543 మంది ఎంపీలు ఎన్నికయ్యారు.. ఎన్నికైన ఎంపీల్లో సుమారు 46 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు తేలింది. అంటే దాదాపు 251 మంది ఎంపీల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు అయి ఉన్నాయి. దీంట్లో 27 మంది దోషులుగా ఉన్నారు. ఈ విష‌యాన్ని అసోసియేష‌న్ ఆఫ్ డెమోక్ర‌టిక్ రిఫార్మ్స్‌(ఏడీఆర్) సంస్థ తెలిపింది. దిగువ స‌భ‌కు ఎన్నికైన అభ్య‌ర్థుల్లో ఎక్కువ సంఖ్య‌లో క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌వారు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. 233 మంది ఎంపీలు త‌మ‌పై కేసులు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే 2014లో 185 మంది, 2009లో 162 మంది, 2004లో 125 మంది త‌మ‌పై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. 2009 నుంచి క్రిమిన‌ల్ కేసులు ఉన్న ఎంపీల సంఖ్య 55 శాతం పెరిగిన‌ట్లు ఏడీఆర్ డేటా పేర్కొన్న‌ది.

ఈ ఏడాది గెలిచిన 251 మందిలో 170 మంది ఎంపీల‌పై తీవ్ర‌మైన నేరం కేసులు ఉన్నాయి. రేప్, మ‌ర్డ‌ర్‌, హ‌త్యాయ‌త్నం, కిడ్నాప్‌, మ‌హిళ‌ల‌పై నేరాలు ఉన్న‌ట్లు ఏడీఆర్ తెలిపింది. 2019లో 159 ఎంపీల‌పై ఆ కేసులు ఉండేవి. 2009 నుంచి సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు ఉన్న ఎంపీల సంఖ్య 124 శాతం పెరిగిన‌ట్లు ఏడీఆర్ త‌న నివేదిక‌లో తెలిపింది. 27 మంది ఎంపీలు త‌మ‌పై ఉన్న క్రిమిన‌ల్ కేసుల నుంచి నిర్దోషులుగా తేలిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఐపీసీలోని సెక్ష‌న్ 302 కింద మ‌ర్డ‌ర్ కేసు బుక్ అయిన‌ట్లు న‌లుగురు ఎంపీలు పేర్కొన్నారు. ఐపీసీలోని 307 సెక్ష‌న్ కింద 27 హ‌త్యాయ‌త్నం కేసులు ఉన్న‌ట్లు తెలిపారు.

మ‌హిళ‌ల‌పై నేరాల‌కు పాల్ప‌డిన వారు 15 మంది ఉన్నారు. ఇద్ద‌రిపై ఐపీసీ 376 సెక్ష‌న్ కింద రేప్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. న‌లుగురిపై కిడ్నాప్ కేసులు, విద్వేష ప్ర‌సంగాల‌కు చెందిన 43 కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. 2024 ఎన్నిక‌ల్లో క్రిమిన‌ల్ కేసులు ఉన్న వారిలో నెగ్గిన శాతం 15.3 శాతంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. తాజా ఎన్నిక‌ల్లో బీజేపీ 240 సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. అతిపెద్ద పార్టీగా ఆవిర్భించిన ఆ పార్టీలో 94 మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి. 99 సీట్లు గెలిచిన కాంగ్రెస్‌లో 49 శాతం మందిపై క్రిమిన‌ల్ కేసులు ఉన్న‌ట్లు ఏడీఆర్ తెలిపింది. 37 సీట్లు గెలిచిన ఎస్పీలో 21 మందిపై క్రిమిన‌ల్ ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తృణ‌మూల్‌, డీఎంకే పార్టీల్లో 13 శాతం నేర‌స్థులు, టీడీపీలో 8 శాతం నేర‌స్థులు, శివ‌సేన‌లో అయిదు శాతం క్రిమిన‌ల్ కేసులు ఉన్న నేత‌లు ఉన్న‌ట్లు ఏడీఆర్ పేర్కొన్న‌ది. బీజేపీకి చెందిన 63 మంది, కాంగ్రెస్‌కు చెందిన 32 మంది, ఎస్పీకి చెందిన 17 మందిపై సీరియ‌స్ క్రిమిన‌ల్ కేసులు ఉన్నాయి.