Wednesday, September 25, 2024
HomeUncategorizedదక్షిణాది రాష్ట్రాలపై మోడీ ఫోకస్.. !

దక్షిణాది రాష్ట్రాలపై మోడీ ఫోకస్.. !

Date:

బిజెపి దక్షిణాది రాష్ట్రాలపై ప్రధాన దృష్టి సారించింది. దేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికల సందర్భంగా పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ క్రమంలో మోడీ తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టారు. వాస్తవానికి ఈ నెల 16 నుంచి ప్రధాని తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల ప్రధాని పర్యటనలో స్వల్ప మార్పులతో ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మోడీ ఎన్నికల ప్రచారంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మొదట ఈనెల 16వ తేదీన ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తారని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి సమాచారం వచ్చినా…తాజాగా ఈనెల 15ననే ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని బీజేపీ శ్రేణులు తెలిపాయి. ఈనెల 15వ తేదీన హైదరాబాద్ కు వచ్చి అదే రోజు మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో చేపట్టే రోడ్ షోలో పాల్గొంటారు. 16వ తేదీన నాగర్ కర్నూల్లో, 18న జగిత్యాలలో బీజేపీ ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారు. ఈనెల 15న మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు గంటన్నరసేపు భారీ రోడ్ షో ఉంటుందని బీజేపీ నేతలు వివరించారు.

ఈ నెల 15, 16 తేదీలతో పాటు 18న కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ ఈ నెల 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డిలో పర్యటించి ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ప్రధాని ఎన్నికల ప్రచారంతో బీజేపీ శ్రేణుల్లోజోష్ వచ్చింది. తాజాగా మరో మారు మూడు రోజులపాటు ప్రధాని తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండడంపై బీజేపీ నేతలు, శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధాని దక్షిణాది రాష్ట్రాలపై దూకుడు పెంచారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మోడీ పర్యటనలు చేపడుతున్నారు.

దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. మరికొన్ని రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార పార్టీ బీజేపీ వేగం పెంచింది. అంతేకాకుండా ఈసారి ప్రధాని మోడీ నేతృత్వంలో ఎలాగైనా 400 సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ దక్షిణ భారత పర్యటన మార్చి 15 నుంచి 19 వరకు ఖరారు చేశారు. దీంతో ఈ టార్గెట్ లక్ష్యంగా యూపీ, బీహార్ వంటి రాష్ట్రాలపై ఆధారపడకుండా దక్షిణాది రాష్ట్రాలపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు. అందుకోసం డైరెక్టుగా ప్రధానియే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి 19 వరకు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అయితే పది రోజుల వ్యవధిలో తెలంగాణకు ప్రధాని మోడీ రావడం ఇది రెండోసారి కావడం విశేషం.