Saturday, October 5, 2024
HomeUncategorizedతొలిసారి ప్రియాంక రాజకీయ అరంగేట్రం

తొలిసారి ప్రియాంక రాజకీయ అరంగేట్రం

Date:

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వయనాడ్‌ నుంచి రాజకీయ అరంగేట్రం చేయనున్నారని ఇటీవల కాంగ్రెస్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రియాంకకు మద్దతుగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వయనాడ్‌లో ప్రచారం చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తుండడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్‌లలో పోటీ చేసి రెండు స్థానాల్లోను భారీ మెజారిటీతో గెలుపొందారు. రెండు స్థానాల్లో గెలిచినవారు ఒక స్థానాన్ని వదులుకోవాలనే నియమం ప్రకారం ఆయన వయనాడ్‌ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఈ స్థానంలో ప్రియాంక పోటీకి దిగుతున్నారు. 2019 నుంచి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న ప్రియాంక ఇప్పటివరకు ఏ స్థానంలోనూ పోటీ చేయలేదు. కాంగ్రెస్‌పై అభిమానం చూపుతున్న వయనాడ్‌లో ఆమె తొలిసారి పోటీ చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తారని హస్తం పార్టీ ధీమా వ్యక్తంచేస్తోంది.

లోక్‌సభ ఎన్నికల సమయంలో పశ్చిమబెంగాల్‌లో సీట్ల పంపకంపై విభేదాల కారణంగా మమతా బెనర్జీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీలోకి దిగారు. అయితే, ఈ రెండు పార్టీలు జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో భాగంగా కలిసి పనిచేశాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం మమత మాట్లాడుతూ ఇండియా కూటమికి తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) బయటినుంచే మద్దతిస్తుందని పేర్కొన్నారు.