Sunday, December 22, 2024
HomeUncategorizedతైవాన్‌ పారిశ్రామికవేత్తకు పద్మభూషణ్ అవార్డు

తైవాన్‌ పారిశ్రామికవేత్తకు పద్మభూషణ్ అవార్డు

Date:

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డును ప్రకటించింది. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి.. పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైజయంతిమాల బాలి, బిందేశ్వర్ పాఠక్, పద్మా సుబ్రహ్మణ్యం ఇదే జాబితాలో ఉన్నారు. పద్మభూషణ్ అవార్డులకు ఎంపికైన వారిలో ఎం ఫాతిమా బీవీ, మిథున్ చక్రవర్తి, హర్మస్ జీ ఎన్ కామా, సీతారాం జిందాల్, అశ్విన్ బాలచంద్ మెహతా ఉన్నారు. తైవాన్‌కు చెందిన దిగ్గజ పారిశ్రామికవేత్త యువాంగ్ లియూ పేరు సైతం పద్మభూషణ్ అవార్డుల జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది.

ప్రఖ్యాత చిప్, సెమీకండక్టర్లు, మైక్రోసిస్టమ్స్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తోన్నారు. యాపిల్ స్మార్ట్‌ఫోన్లకు కావాల్సిన విడి పరికరాలను తయారు చేసింది ఈ సంస్థే. తైవాన్‌కు చెందిన కంపెనీ ఇది. భారత్‌లో పెద్ద ఎత్తున పరిశ్రమలను నెలకొల్పడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. తమిళనాడులో ఐఫోన్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పింది ఫాక్స్‌కాన్. 40,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలను కల్పించింది. బెంగళూరు శివార్లలో యూనిట్‌ను నెలకొల్పడానికి కర్ణాటక ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. తైవాన్‌లోని నేషనల్ చియావో టంగ్ యూనివర్శిటీ నుంచి ఎలక్ట్రోఫిజిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు యువాంగ్ లియూ. అనంతరం యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చదివారు. పారిశ్రామికరంగంలో ఆయన చేస్తోన్న కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం లీయూకు మూడో అత్యత్తమ పౌర పురస్కారం పద్మా భూషణ్‌తో గౌరవించింది.