Saturday, September 21, 2024
HomeUncategorizedతెలుగు బిడ్డను వరించిన భారతరత్న

తెలుగు బిడ్డను వరించిన భారతరత్న

Date:

తెలుగు ప్రాంతానికి చెందిన మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. పీవీతో పాటు మాజీ ప్రధాని చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా భారతరత్న ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు. ఇప్పటికే బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తో పాటు బీజేపీకురువృద్ధుడు ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. మొత్తంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఐదు మందికి భారతరత్న పురస్కారం ప్రకటించింది.

పీవీ పూర్తి పేరు.. పాములపర్తి వేంకట నరసింహారావు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగర ఆయన స్వస్థలం. మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1962, 1967, 972లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా పనిచేసే అవకాశం దక్కింది. తొమ్మిదేళ్ల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా సేవలందించారు.

1971లో జరిగిన పరిణామాలతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పీవీ నరసింహారావును నియమించింది. రెండు సంవత్సరాల పాటు సీఎం పదవిలో కొనసాగిన పీవీ.. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పి.. జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పారు. 1977లో తొలిసారి హనుమకొండ లోక్‌సభస్థానం పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 1980 మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1984, 1989లో మహారాష్ట్రలోని రాంటెక్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా సేవలందించారు.

1991లో అనూహ్యంగా ఆయన్ను ప్రధానమంత్రి పదవి వరించింది. ప్రధాని పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా పీవీ నరసింహారావు చరిత్రలో నిలిచిపోయారు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, గాడితప్పిన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అంతేకాదు బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలు కూడా ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే జరిగాయి.