Tuesday, September 24, 2024
HomeUncategorizedతెలియకుండా ఏ మెడిసిన్ వాడొద్దు

తెలియకుండా ఏ మెడిసిన్ వాడొద్దు

Date:

చాలా మంది తమ అనారోగ్య సమస్యలకు వైద్యుడి దగ్గరికి వెళ్లడం లేదు. తెలిసిన వారి సలహా తీసుకోవడమో లేదా నెట్‌లో వెతికి ఏదో ఒక యాంటీబయాటిక్ మెడిసిన్ వాడుతున్నారు. చిన్న అనారోగ్య సమస్యలకు డాక్టర్‌ను సంప్రదించడం ఎందుకనే ఆలోచన రోజురోజుకు పెరిగిపోయింది. ఇలా ఓ క్రమ పద్ధతి లేకుండా యాంటీబయాటిక్స్‌ వినియోగిస్తూ ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. విచ్చలవిడిగా ఇలాంటి మందులు వాడితే, చివరికి శరీరం ఏ ఔషధాలకు స్పందించక ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. వీటి వినియోగం, విక్రయాలపై సరైన నియంత్రణ లేకపోతే రానున్న రోజుల్లో యాంటీమైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ రూపంలో పెనుముప్పు తప్పదని తరచూ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించిన ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

  • యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి?

యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ లేదా ఏఎంఆర్ అంటే, బ్యాక్టీరియా, ఫంగస్‌, జెర్మ్స్ డ్రగ్‌-రెసిస్టెంట్‌గా మారడం. యాంటీబయాటిక్స్, ఇతర మెడిసిన్ శరీరంపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడం. దీంతో అంటువ్యాధులకు చికిత్స కష్టతరమవుతుంది, ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) పెరుగుతున్న కారణంగా, ఢిల్లీలోని ఫార్మసిస్ట్‌లు వ్యాలిడ్‌ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏఎంఆర్ మందులను అమ్మకూడదని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జనవరి 1న జారీ చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలకు అనుగుణంగా స్టేట్‌ డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఈ చర్యలు తీసుకుంది.

ఆల్ ఢిల్లీ కెమిస్ట్స్ అసోసియేషన్‌కు జారీ చేసిన ఈ గైడ్‌లైన్స్‌, డ్రగ్స్ రూల్స్‌లోని షెడ్యూల్ H & H1కి కట్టుబడి ఉండాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఈ షెడ్యూల్స్‌ కింద పేర్కొన్న యాంటీబయాటిక్స్, అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ ఉంటే మాత్రమే అందజేయాలని నిర్దేశిస్తున్నాయి. యాంటీ మైక్రోబయాల్స్ విచక్షణారహిత వినియోగాన్ని అరికట్టడం ద్వారా పెరుగుతున్న ఏఎంఆర్ సమస్యలను పరిష్కరించవచ్చని ఢిల్లీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.

*రికార్డులు తప్పనిసరి

మార్గదర్శకాల ప్రకారం, ఫార్మసిస్ట్‌లు మూడు సంవత్సరాల పాటు మూడు, నాలుగో జనరేషన్‌ యాంటీమైక్రోబయాల్స్‌ను కలిగి ఉన్న షెడ్యూల్ H1 ఔషధాల విక్రయాల వివరణాత్మక రికార్డులను మెయింటైన్‌ చేయాలి. ఈ శక్తివంతమైన మందుల పంపిణీని పర్యవేక్షించడానికి, నియంత్రించడానికి ఈ రికార్డ్ కీపింగ్ నిబంధన చాలా కీలకం. రాష్ట్ర ఆరోగ్య శాఖకు చెందిన ఒక అధికారి ఈ విషయంపై మాట్లాడుతూ, ప్రజారోగ్యానికి ఏఎంఆర్ ముప్పు తీవ్రతను పేర్కొన్నారు. ఏఎంఆర్ ద్వారా ఎదురయ్యే సవాళ్లను గుర్తిస్తూ, యాంటీబయాటిక్స్ విచక్షణారహిత వినియోగాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని నియంత్రణ సంస్థలు నిరంతరం అప్రమత్తంగా ఉంటాయి.

సాధారణ ప్రజల్లో ఏఎంఆర్ పెరుగుతున్న సంఘటనలపై ఢిల్లీ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాజా గైడ్‌లైన్స్‌, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం, బాధ్యతాయుతమైన యాంటీబయాటిక్ వినియోగాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతున్నాయి. వాస్తవానికి చాలా రకాల యాంటీమైక్రోబయాల్స్ షెడ్యూల్ H & H1 ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్‌లో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు వైద్యుల ప్రిస్క్రిప్షన్‌కు అనుగుణంగా మాత్రమే వీటిని మెడికల్ షాపుల్లో అమ్మనున్నారు.