Tuesday, October 8, 2024
HomeUncategorizedతెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు

తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు

Date:

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అన్యాయం జరిగిందనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని, బడ్జెట్‌ను సవరించి తెలంగాణకు నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం డిమాండ్‌ చేశారు.

*తీర్మానంలోని అంశాలు..*

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని.. కేంద్ర మంత్రులను కలిసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరటంతో పాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక సార్లు అభ్యర్ధనలు అందించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా బడ్జెట్‌లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపించింది. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేటట్లు తగిన చర్యలు తీసుకోవాలి” అని శాసనసభ తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి భారాస మద్దతు తెలపగా, భాజపా సభ్యులు వాకౌట్‌ చేశారు.