Monday, October 7, 2024
HomeUncategorizedతెలంగాణ ట్రైనీ ఐఎఎస్‌పై ట్రోల్స్

తెలంగాణ ట్రైనీ ఐఎఎస్‌పై ట్రోల్స్

Date:

దేశంలో సివిల్ సర్వీస్ పరీక్షల్లో కొందరు నకిలీ సర్టిఫికేట్స్ ద్వారా రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారనే వార్త గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఐఏఎస్‌ పూజా ఖేద్కర్‌ యూపీఎస్సీకి నకిలీ సర్టిఫికేట్స్ అందించి దాని ద్వారా వచ్చిన రిజర్వేషన్‌తో ఉద్యోగం పొందింది అనే ఆరోపణలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో పలువురు ఐఏఎస్‌లు అలానే ఉద్యోగాలు సంపాదించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తాజాగా తెలంగాణకు చెందిన ఓ ఐఏఎస్ అధికారి కూడా ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించి ఉద్యోగం సంపాదించారని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే అతనిపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన ప్రఫుల్ సివిల్స్‌లో 523వ ర్యాంక్ సాధించాడు. అయితే ఈ సమయంలో ఆర్థోపెడికల్లీ హ్యాండీక్యాప్డ్‌ సర్టిఫికెట్‌ కూడా క్లెయిమ్‌ చేశారు. అయితే ప్రఫుల్ కూడా మహారాష్ట్రలో ట్రైనీ ఐఏఎస్‌ ఖేద్కర్‌ తరహాలోనే నకిలీ దివ్యాంగుడని, ఆయన సర్టిఫికెట్‌ తప్పని పలువురు ‘ఎక్స్‌’ వేదికగా ట్రోల్‌ చేస్తున్నారు. దీనికి గాను పలువురు నెటిజన్లు ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన సైక్లింగ్‌, హార్స్‌ రైడింగ్‌, బోటింగ్‌, ట్రెక్కింగ్‌ చేసిన ఫొటోలను షేర్ చేస్తున్నారు.

కాలు బాగాలేని వ్యక్తి ఇవన్నీ ఎలా చేస్తున్నాడు? అంటూ విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విషయం అతని దృష్టికి రావడంతో ఆయన స్పందించారు. తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఐఏఎస్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. అంగవైకల్యం ఉంటే సాధారణ జీవితం గడపడం తప్పా అంటూ మండిపడ్డారు. తనపై వస్తున్న ట్రోల్స్‌కి బదులుగా మూడు పేజీల లేఖతో నెటిజన్లకు స్పష్టత ఇచ్చారు. 2019 యూపీఎస్సీ ఇంటర్వ్యూ అనంతరం ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ సైన్సెస్‌(ఏఐఐఎంఎస్‌) మెడికల్‌ బోర్డు ముందు హాజరవ్వగా.. అక్కడి వైద్యులు తనకున్న లోపాన్ని సర్టిఫైచేశారని తెలిపారు. అదే రిపోర్టును డీవోపీటీతోపాటు యూపీఎస్సీకి పంపినట్లు తెలిపారు.

కొందరు తనపై మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న విషయం తన దృష్టికి రావడంతో చాలా బాధ అనిపించిందన్నారు. నిజంగా తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారిని ప్రశ్నిస్తే అందులో అర్థముంది కానీ, తనలా.. నిజాయతీగా ఉన్న వారిని ఆన్‌లైన్‌లో వ్యక్తిగత ఫొటోలు పెట్టి మరీ తప్పుడు ఆరోపణలు చేయడం తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడమనే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.