Monday, September 23, 2024
HomeUncategorizedతెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై బిజెపి కసరత్తు

తెలంగాణలో ఎంపీ అభ్యర్థులపై బిజెపి కసరత్తు

Date:

తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు దక్కించుకునేందుకు బిజెపి ఇప్పటికే కసరత్తులు ప్రారంభించింది. తాజాగా పలువురు అభ్యర్థులను ఖరారు చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నాలుగు స్థానాల్లో మూడు సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పోటీ చేయనున్నారు. కరీంనగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేయనున్నారు. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాపూరావుకు మాత్రం ఈసారి టికెట్ లేనట్లేనని తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి మరో నేతను బరిలోకి దింపే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు, చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం నుంచి డాక్టర్ వెంకటేశ్వర్ రావు, భువనగిరి ఎంపీ స్థానం నుంచి బూర నర్సయ్యగౌడ్‌లను అభ్యర్థులుగా దాదాపు ఖరారు చేసింది. మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసేందుకు డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఆసక్తి చూపుతున్నారు. మల్కాజిగిరి నుంచి బీజేపీ సీనియర్ నేతలు మురళీధర్ రావు, ఈటల రాజేందర్ తోపాటు ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతి మల్క కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తోంది. మిగితా స్థానాలకు ఎంపీ అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేసేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే బీజేపీ పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో పార్లమెంటు ఎన్నికల్లో 10కిపైగా స్థానాలు దక్కించుకునేందుకు ప్రజల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు.