Friday, October 4, 2024
HomeUncategorizedతిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం

తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం

Date:

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టీటీడీ కొత్త కార్యనిర్వాహణాధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి జే శ్యామలరావు తిరుమలలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇదివరకే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగదిని పరిశీలించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. అక్కడే అన్నప్రసాదాన్ని స్వీకరించారు. తాజాగా లడ్డూ ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టారాయన. ఈ క్రమంలో టీటీడీ పోటు ఉద్యోగులు, సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. తిరుమల గోకులం గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వీరభద్రం, విజిలెన్స్ ఆఫీసర్ నరసింహ ప్రసాద్ పాల్గొన్నారు.

నాణ్యతను పరిశీలించడానికి అప్పటికప్పుడు తయారు చేసిన లడ్డూలను తెప్పించుకుని రుచి చూశారు. లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యి, బేసన్, ఎండు ద్రాక్ష, యాలకులు, జీడిపప్పును ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తోన్నారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. వాటి నాణ్యతను అక్కడికక్కడే పరీక్షించారు. లడ్డూ తయారీలో వినియోగించే వస్తవులను ఫ్లోటింగ్ టెండర్ల ద్వారా సేకరిస్తోన్నామని ఈ సందర్భంగా అధికారులు శ్యామలరావుకు వివరించారు. లోయెస్ట్ బిడ్డింగ్ వేసిన కాంట్రాక్టర్‌కు వాటిని సరఫరా చేసే ఆర్డర్లను ఇస్తోన్నామని చెప్పారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు. గతంలో కంటే మిన్నగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయాలని ఈ సందర్భంగా శ్యామలరావు పోటు సిబ్బందికి ఆదేశించారు. భక్తుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందకుండా జాగ్రత్తలను తీసుకోవాలని అన్నారు. శ్రీవారి ప్రసాదం కోట్లాదిమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశమని, లోపాలు తలెత్తకూడదని చెప్పారు.