Sunday, September 22, 2024
HomeUncategorizedఢిల్లీ దిశగా అన్నదాతల అడుగులు

ఢిల్లీ దిశగా అన్నదాతల అడుగులు

Date:

దేశ రాజధాని ఢిల్లీ దిశగా వేలాది మంది అన్నదాతలు కదిలారు. మంగళవారం పంజాబ్‌, హరియాణా నుంచి రైతులు ట్రాక్టర్లతో నగరానికి బయల్దేరారు. ఈ క్రమంలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిఘా సంస్థల నివేదిక ప్రకారం.. ఒక్క పంజాబ్ నుంచే వందల సంఖ్యలో ట్రాక్టర్లు, వాహనాలు బయల్దేరతాయని, వాటిలో అన్నదాతలు ఆరు నెలలకు సరిపడా ఆహారం, ఇతర సామగ్రిని తీసుకువస్తారని తెలిపింది. కొందరు రైతులు మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వం, పోలీసులు తమ సహనానికి పరీక్ష పెట్టినా డిమాండ్లు నెరవేరేవరకు నిరసన కొనసాగిస్తామన్నారు. ‘సుత్తి, రాళ్లను పగలకొట్టే పరికరాలతో సహా కావాల్సినవన్నీ మా ట్రాలీల్లో ఉన్నాయి. ఆరు నెలలకు సరిపడా రేషన్‌, డీజిల్‌తో మేం మా ప్రాంతాల నుంచి బయలుదేరాం’ అని ఓ రైతు మీడియాకు వెల్లడించారు. ఆయన రెండు ట్రాలీల్లో సామగ్రిని తీసుకొని పంజాబ్‌లోని గురుదాస్‌పుర్‌ నుంచి దేశ రాజధానికి వస్తున్నారు. తమ యాత్రను భగ్నం చేసేందుకు ట్రాక్టర్లకు డీజిల్ దొరక్కుండా చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు.

2020-21లో ఉద్యమించిన రైతులు పలువురు ప్రస్తుత ఆందోళనలో పాల్గొంటున్నారు. అప్పట్లో వారు కొన్ని నెలల పాటు దిల్లీలో చలిని లెక్క చేయకుండా నిరసన చేపట్టారు. హామీ ఇచ్చినట్టుగా కేంద్రం తమ డిమాండ్లను నెరవేర్చలేదని, ఇప్పుడు వాటిని సాధించుకున్నాకే తిరిగి వెనక్కివెళతామని వారు స్పష్టంచేశారు. ఇదిలా ఉంటే..’ఢిల్లీ చలో’ ఆందోళన ఎలా చేపట్టాలన్న దానిపై రైతు సంఘాలు రిహార్సల్‌ నిర్వహించాయని, కొందరు రైతులు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా సహా పలువురు భాజపా సీనియర్‌ నేతల ఇళ్ల ముందు నిరసన చేపట్టే అవకాశాలున్నాయని ఆ నిఘా నివేదిక పేర్కొన్న సంగతి తెలిసిందే.