రికార్డు స్థాయి ఎండలతో తల్లడిల్లిన ఢిల్లీ వాసులకు భారీ వర్షంతో ఉపశమనం లభించింది. గురువారం నుంచి ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది. మూడు గంటల వ్యవధిలోనే ఢిల్లీలో 150 మిల్లీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలోనే రాజధానిలో 228.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారని పేర్కొంది. 1936 జూన్ 28న సఫ్దర్‌జంగ్ అబ్జర్వేటరీలో 24 గంటల వ్యవధిలో 235.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపింది. ఆ తర్వాత ఇప్పుడు 228.1 మి.మీ వర్షం పడినట్లు వివరించింది.
భారీ వర్షం కారణంగా ఢిల్లీ తడిసి ముద్దైంది. రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆజాద్ మార్కెట్ అండర్ పాస్ వద్ద పలు లారీలు నీట మునిగాయి. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. మరోవైపు శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పు కొంత భాగం కూలిపోయి కార్లపై పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. టెర్మినల్-1లోని పైకప్పు కూలడం వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడింది. అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా చెకిన్ కౌంటర్లు మూసివేశామని చెప్పారు.