Wednesday, October 2, 2024
HomeUncategorizedఢిల్లీలో రికార్డు స్థాయిలో ఎండలు

ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఎండలు

Date:

దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. రికార్డు స్థాయిలో తొలిసారిగా నగరంలోని మంగేష్‌పూర్‌లో 52.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎడారి ప్రాంతమైన రాజస్థాన్‌ కంటే ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఎండలు దంచికొడుతున్నాయి. రాజస్థాన్‌లో అత్యధికంగా ఫలోడిలో 51 డిగ్రీలు ఉష్ణోగ్రత రికార్డయ్యింది. మరో వైపు మండుతున్న ఎండలతో ఢిల్లీలో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగింది. 8,302 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉన్నది.

ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్‌ డిమాండ్‌ రావడం ఇదే తొలిసారి. భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. దీంతో జనమంతా ఏసీలు ఎక్కువగా వినియోగించడంతో డిమాండ్‌ పెరిగిందని విద్యుత్‌ శాఖ అధికారులు పేర్కొన్నారు. భారత వాతావరణ శాఖ బుధవారం దేశంలోని వాయువ్య ప్రాంతాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే అవకాశం ఉందని.. వేడిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

బుధవారం నుంచి రాజధానితో సహా పలు ప్రాంతాల్ల వేడిగాలులు, అత్యంత వేడిగాలుల పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది. మంగేశ్‌పూర్‌, నరేలా ప్రాంతాల్లో మంగళవారం 49.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో వైపు ఎండల నేపథ్యంలో ప్రభుత్వం నీటి సరఫరాను పరిమితం చేసింది. యమునా నదిలో నీటి మట్టం తక్కువగా ఉందని.. నగరంలో ఏ సమయంలోనైనా నిరంతరాయంగా నీటి సరఫరా ఉండదని.. రోజుకు రెండుగంటలు సరఫరా ఉంటుందని తెలిపింది. నీటి సమస్య ఉన్నా లేకపోయినా.. ప్రజలంతా తప్పనిసరిగా నీటిని పొదుపుగా వాడుకోవాలని మంత్రి అతిషి కోరారు.