Sunday, September 22, 2024
HomeUncategorizedఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇస్తాం

ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక్క సీటు ఇస్తాం

Date:

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి పెద్దగా సీట్లు ఇవ్వబోమని, ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌ సభ స్థానాల్లో ఒకటే ఇస్తామని ఆప్ పార్టీ వెల్లడించింది. ఆప్‌ ఎంపీ సందీప్‌ పాఠక్‌ మాట్లాడుతూ ”వాస్తవ పరిస్థితుల ఆధారంగా దిల్లీలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటులో కూడా అవకాశం లేదు. కానీ, పొత్తు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని మేం వారికి దిల్లీలో ఒక సీటు ఇస్తున్నాం. మేం ఆరు స్థానాల్లో పోరాడతామని ప్రతిపాదించాం. ప్రస్తుతం ఆ పార్టీకి ఇక్కడ ఒక్క అసెంబ్లీ లేదా లోక్‌సభ సీటు లేదు. ఎంసీడీ ఎన్నికల్లో 250 స్థానాల్లో ఆ పార్టీ గెలుచుకొంది తొమ్మిది మాత్రమే ” అని వెల్లడించారు. సీట్ల సర్దుబాటుపై ఇండియా కూటమిలో ఇప్పటికే వివాదాలు పెరుగుతున్న వేళ ఆప్‌ ప్రకటన వెలువడటం గమనార్హం. తాజాగా వచ్చిన ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్‌ స్పందన ఇంకా వెలువడలేదు.

పంజాబ్‌లో కూటమితో ఎలాంటి పొత్తు ఉండబోదని ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇటీవల స్పష్టంచేశారు. చండీగఢ్‌లోని ఏకైక స్థానంలో, పంజాబ్‌లోని మిగిలిన 13 లోక్‌సభ స్థానాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వెల్లడించారు. ఆదివారం పంజాబ్‌లో జరిగిన ఓ సభలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో దిల్లీలోని ఏడు లోక్‌ సభ సీట్లను తమకు ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే ఆప్‌ నుంచి ప్రతిపాదన వచ్చింది. వాస్తవానికి ఇరు పార్టీలు దిల్లీలో 4:3 నిష్పత్తిలో సీట్లు పంచుకోవాలని చర్చలు జరుగుతున్నట్లు గతంలో వార్తలొచ్చాయి. ఇప్పటికే తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా పశ్చిమబెంగాల్‌లో హస్తం పార్టీతో ఎలాంటి సీట్ల సర్దుబాటు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించింది. తాజాగా ఆప్‌ కూడా నామమాత్రపు సీట్లనే కాంగ్రెస్‌కు ప్రతిపాదించింది.