Saturday, September 21, 2024
HomeUncategorizedఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ ఆందోళన

ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ ఆందోళన

Date:

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. కేంద్ర ప్రభుత్వంపై కయ్యానికి కాలు దువ్వింది. ఛలో ఢిల్లీ పేరుతో దేశ రాజధానిలో భారీ ఎత్తున ఆందోళనను నిర్వహిస్తోంది. నిరసన ప్రదర్శనలకు దిగింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈ ఉదయం ఈ ఆందోళన ఆరంభమైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా.. కర్ణాటక మంత్రులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. వార్షిక బడ్జెట్‌లో కర్ణాటకకు ఎలాంటి కేటాయింపులు లేకపోవడాన్ని నిరసిస్తూ అధికార కాంగ్రెస్ పార్టీ.. ఈ ఆందోళనను చేపట్టింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌ను ఉద్దేశించి సిద్ధరామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. లెక్కలతో సహా చెలరేగిపోయారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమను కనపరుస్తోన్నారంటూ మండిపడ్డారు. పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వనికి అత్యధిక ఆదాయాన్ని పంపిస్తోన్న రాష్ట్రాల్లో కర్ణాటక రెండో స్థానంలో ఉంటోందని సిద్ధరామయ్య గుర్తు చేశారు. మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 4.30 లక్షల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో కేంద్రానికి కట్టబోతోన్నామని చెప్పారు.

అయినప్పటికీ.. ఆ స్థాయిలో కేంద్రం నుంచి తమ రాష్ట్రానికి వాటా అందట్లేదని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 100 రూపాయలను పన్నుల రూపంలో కేంద్రానికి పంపిస్తే అక్కడి నుంచి తిరిగి వచ్చేది 12-13 రూపాయలేనని పేర్కొన్నారు. కేంద్రం ఎంతగా వివక్ష చూపిస్తోందనడానికి ఈ లెక్కలే నిదర్శనమని ధ్వజమెత్తారు. కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్థిక శాఖ మంత్రిగా పని చేస్తోన్న నిర్మల సీతారామన్.. తన సొంత రాష్ట్రానికీ ద్రోహం చేయడానికి వెనుకాడట్లేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. దేశ సమగ్రతను దెబ్బ తీసేలా, ప్రాంతీయ అసమానతలను పెంచి పోషించేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు.