Saturday, September 21, 2024
HomeUncategorizedఢిల్లీలో ఆందోళనకు దిగిన కేరళ సీఎం

ఢిల్లీలో ఆందోళనకు దిగిన కేరళ సీఎం

Date:

కేంద్రం నుంచి అందే నిధుల విషయంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. వారంతా కేరళ హౌస్ నుంచి జంతర్‌మంతర్‌ వరకు ర్యాలీగా వచ్చారు. ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్‌, భగవంత్‌ మన్‌ కూడా నిరసన వేదిక వద్దకు వచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

మరోపక్క కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ ఇందులో పాల్గొనేందుకు నిరాకరించగా.. కన్నడ నేతలు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మద్దతు తెలిపారు. బుధవారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నేతృత్వంలో ఆందోళన జరగ్గా.. తాజాగా కేరళ సీఎం కూడా అదే బాటపట్టడం గమనార్హం. నిన్న నిరసనలో పాల్గొన్న కర్ణాటక సీఎం సిద్ధూ కేంద్రంపై విమర్శలు చేశారు. దేశంలోనే అత్యధిక పన్నులు కేంద్రానికి చెల్లించే రాష్ట్రాల్లో రెండోదైన కర్ణాటక సుమారు రూ.1.88 లక్షల కోట్లు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయకపోవడమే దీనికి కారణమన్నారు. 1972లో నాటి కేంద్ర సర్కారు ఇచ్చిన జనాభా నియంత్రణ పిలుపును అందిపుచ్చుకున్న దక్షిణ భారత రాష్ట్రాలు జనసంఖ్యను నియంత్రించాయన్నారు. నేడు అదే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ విమర్శలను ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు దేశ విభజనకు బీజాలు నాటేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.