‘డేరా సచ్చా సౌదా’ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా ఉన్నాడు. అయితే డేరా బాబా మరోసారి జైలు నుంచి బయటకు వచ్చారు. 21 రోజుల పాటు తాత్కాలిక బెయిల్ లభించడంతో ఆయన మంగళవారం ఉదయం 6:30 గంటలకు జైలు నుంచి విడుదలైనట్లు అధికారులు తెలిపారు.
ఈ 21 రోజులూ గుర్మీత్ రామ్ సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని బర్నావాలో ఉన్న డేరా ఆశ్రమంలో బస చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. కాగా డేరాబాబా విడుదలను వ్యతిరేకిస్తూ శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను పంజాబ్-హర్యానా హైకోర్టు ఇటీవలే కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ పరిణామం జరిగిన రోజుల వ్యవధిలోనే ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించడం గమనార్హం.