Saturday, September 21, 2024
HomeUncategorizedట్రెక్కింగ్‌కు చేస్తూ మంచులో కూరుకుపోయారు

ట్రెక్కింగ్‌కు చేస్తూ మంచులో కూరుకుపోయారు

Date:

ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఇద్దరు యువతీయువకులు మంచులో కూరుకుపోయి తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరగగా . వారివెంట వెళ్లిన జర్మన్‌ షెపర్డ్‌ జాతికి చెందిన శునకం ఆ మృతదేహాలను గుర్తించడంలో సాయపడింది. దాదాపు 48 గంటలపాటు వాటి దగ్గరే ఉంటూ బిగ్గరగా మొరుగుతూనే ఉంది. అది గమనించిన సహాయక బృందాలు వాటిని వెలికితీశాయి. మృతులను పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన అభినందన్‌ గుప్త (30), పుణెకి చెందిన ప్రణీత (26)గా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

బీర్‌ బిల్లింగ్‌ ప్రదేశం సముద్రమట్టానికి 5వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. పలువురు సాహస యాత్రికులు ఇక్కడ ట్రెక్కింగ్‌, పారాగ్లైడింగ్‌ చేస్తూ ఉంటారు. గుప్తా గత నాలుగేళ్లుగా ఇక్కడే ఉంటూ ట్రెక్కింగ్‌ చేసేవాడు. కొత్తగా వచ్చేవారిని తనవెంట తీసుకెళ్తుండేవాడు. ప్రణీత కొన్ని వారాల క్రితమే ఇక్కడికి వచ్చారు. మొత్తం నలుగురు సభ్యుల బృందం బీర్‌ బిల్లింగ్‌ను చూసేందుకు కారులో బయలుదేరారు. మధ్యలో వాతావరణం అనుకూలించకపోడంతో.. నడవడం ప్రారంభించారు. కొంతదూరం వెళ్లేసరికి అందులో ఇద్దరు తమవల్ల కావడం లేదంటూ వెనక్కి వచ్చేశారు. తనకు దారి తెలుసని గుప్తా చెప్పడంతో.. ప్రణీత అతడితో కలిసి ప్రయాణం కొనసాగించింది. వారిద్దరితోపాటు ఓ శునకం కూడా ఉంది. కొంతదూరం వెళ్లాక.. ఏటవాలు ప్రాంతంలో ఒక్కసారిగా మంచు కుంగిపోవడంతో వారిద్దరూ అందులో కూరుకుపోయారు. లేచేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి ప్రాణాలు కోల్పోయారు.

ఎంతకీ వారు తిరిగి రాకపోవడంతో, కిందికి వచ్చిన మిగిలిన ఇద్దరు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన అధికారులు రెండు బృందాలను ఏర్పాటుచేసి, గాలింపు చర్యలు చేపట్టారు. బీర్‌ బిల్లింగ్‌ ప్రదేశానికి దాదాపు 500 మీటర్ల దూరంలో శునకం అరుపులు వినిపించి అటువైపు వెళ్లగా.. రెండు మృతదేహాలు కనిపించాయి. పోస్టుమార్టం అనంతరం వాటిని వారి బంధువులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన కంగ్రా జిల్లాలో భారీగా మంచు కురుస్తోందని, పర్యటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎక్కడికి వెళ్లినా స్థానికులను వెంట ఉంచుకోవాలని సూచించారు.