Friday, September 20, 2024
HomeUncategorizedజ్ఞాన్‌వాపి మసీదులో పూజలకు అనుమతి

జ్ఞాన్‌వాపి మసీదులో పూజలకు అనుమతి

Date:

వారణాశిలోని జ్ఞాన్‌వాపి మసీదులో పూజలను నిర్వహించడానికి హిందువులకు అనుమతి లభించింది. ప్రతి ఒక్క హిందువూ ఇకపై ఈ మసీదులో పూజలు చేసుకోవచ్చు. మసీదు ఆవరణలో ఉన్న వ్యాస్ కా ఠికానాలో రోజువారీ పూజాదికాలను నిర్వహించుకోవడానికి అవరమైన అనుతులు హిందువులకు లభించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, సుహృద్భావ వాతావరణంలో పూజలు జరుపుకోవడానికి వారం రోజుల్లోగా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లను చేయాల్సి ఉంటుంది.

ఈ మేరకు బుధవారమే వారణాశి కోర్టు.. అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాలు వెలువడినప్పటి నుంచీ ఏడు రోజుల్లో ఈ ఏర్పాట్లన్నింటినీ పూర్తి చేయాలంటూ కోర్టు సూచించినట్లు హిందువుల తరఫు న్యాయవాదలు విష్ణుకుమార్ జైన్, సుభాష్ నందన్ చతుర్వేది తెలిపారు. ఏ ఒక్కరికో పరిమితం కాదని, హిందువులందరూ పూజల్లో పాల్గొనవచ్చని కోర్టు ఆదేశించినట్లు చెప్పారు.

ఏడు రోజుల గడువు ఉన్నప్పటికీ.. ఆదేశాలు వెలువడిన 24 గంటల్లోనే మసీదులో పూజలు మొదలయ్యాయి. కొద్దిసేపటి కిందటే మసీదు బేస్‌మెంట్‌లో హిందు సంప్రదాయాల ప్రకారం.. పూజాదికాలు జరిగాయి. అర్చకులు మహా శివుడికి పూజలు చేశారు. ఘంటానాదాన్ని వినిపించారు. వేదమంత్రోచ్ఛారణలను జపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో, కొన్ని ఫొటోలను ప్రముఖ న్యాయవాది విష్ణుకుమార్ జైన్.. తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.