Sunday, September 22, 2024
HomeUncategorizedజోమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు ఆదాయం రూ.83 కోట్లు

జోమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు ఆదాయం రూ.83 కోట్లు

Date:

ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూపంలో ఈ ఏడాది మార్చి నాటికి రూ.83 కోట్లు వసూలు చేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ రుసుమును కస్టమర్ల ఆర్డర్లపై విధిస్తున్న విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం పుంజుకోవడానికి ఈ ఫీజూ ఒక కారణమని కంపెనీ తెలిపింది. 2024 మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో జొమాటో సర్దుబాటు చేసిన ఆదాయం 27 శాతం పెరిగి రూ.7,792 కోట్లకు పెరిగింది.

గోల్డ్‌ కస్టమర్లకు ఇచ్చే ఉచిత డెలివరీ వల్ల కొంత రాబడి తగ్గింది.అయితే అధిక ఆదాయం ప్లాట్‌ఫామ్‌ ఫీజు, ఆర్డర్ల సంఖ్య పెరగడం సహా ఇతర మార్గాల ద్వారా సమకూరిందని జొమాటో తెలిపింది. మరోవైపు గత ఏడాదిలో రాత్రి పొద్దుపోయాక వచ్చిన ఆర్డర్లలో అత్యధికం దిల్లీ నుంచేనని తెలిపింది. ఉదయం అల్పాహారం ఆర్డర్లు బెంగళూరు నుంచి ఎక్కువగా అందాయని వెల్లడించింది. జొమాటో గత ఏడాది ఆగస్టు నుంచి ఆర్డర్‌పై రూ.రెండుతో ప్లాట్‌ఫామ్‌ ఫీజు వసూలు చేయడాన్ని ప్రారంభించింది. క్రమంగా దాన్ని కీలక నగరాల్లో రూ.ఆరుకు పెంచింది. దీని ప్రత్యర్థి సంస్థ స్విగ్గీ సైతం ఈ తరహా రుసుము వసూలు చేస్తోంది. తద్వారా ఈ సంస్థలు తమ లాభదాయకతను పెంచుకునేందుకు యత్నిస్తున్నాయి.