Friday, October 4, 2024
HomeUncategorizedజొమాటో ఒకే వేదికపై 4,300 మందికి సీపీఆర్‌ శిక్షణ

జొమాటో ఒకే వేదికపై 4,300 మందికి సీపీఆర్‌ శిక్షణ

Date:

అత్యవసర సమయాల్లో ఉన్నవారికి వైద్య సాయం అందించేలా ప్రముఖ ఫుడ్‌ డెలివరీ కంపెనీ జొమాటో అరుదైన రికార్డ్‌ సొంతం చేసుకుంది. తమ డెలివరీ భాగస్వాములను తీర్చిదిద్దింది. ఒకే వేదికపై 4,300 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌కు సీపీఆర్‌ శిక్షణ అందించి గిన్నిస్‌ రికార్డును కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ తెలిపారు.

”ముంబయిలో నిర్వహించిన ఓ వేదికలో ఏకంగా 4,300 మంది డెలివరీ పార్టనర్స్‌కు ప్రథమచికిత్స ఎలా అందించాలో నేర్పించాం. దీంతో గిన్నిస్‌ రికార్డ్‌ సొంతం చేసుకున్నాం. ప్రస్తుతం జొమాటోలో 30,000 కంటే ఎక్కువ డెలివరీ భాగస్వాములు వైద్యం అందించడానికి, రోడ్‌సైడ్‌ ఎమర్జెన్సీ సమయంలో సాయం అందించడానికి వృత్తిపరంగా శిక్షణ పొందారు” అని గోయల్‌ ”ఎక్స్‌” వేదికగా పేర్కొన్నారు. దేశంలోని ఎమర్జెన్సీ హీరోలకు సెల్యూట్ అంటూ ముంబయి ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు జత చేశారు. తమ డెలివరీ భాగస్వాములు ప్రథమ చికిత్స, సీపీఆర్‌ అందించడానికి వృత్తిపరమైన శిక్షణ పొందినట్లు జొమాటో తన అధికారిక ”ఎక్స్‌” ఖాతా ద్వారా పంచుకుంది. అంతేకాదు ఈ శిక్షణ తీసుకున్నవారి బ్యాగ్‌పై గ్రీన్‌ కలర్‌ ”+” చిహ్నం ఉంటుందని పేర్కొంది. జొమాటో చేపట్టిన చర్యపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘చాలా గొప్ప ప్రయత్నం’, ‘ ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నందుకు అభినందనలు’, ‘డెలివరీ పార్ట్‌నర్స్‌కు మీరు ఇచ్చిన శిక్షణ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.