జార్ఖండ్ రాష్ట్రంలో రాజకీయాలు రసకందాయంగా మారాయి. ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ పార్టీ లీడర్‌గా జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపయ్ సోరెన్‌ను జేఎంఎం ప్రకటించినప్పటి గంటలు గడుస్తున్నా.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం అందలేదు. దీంతో ఏం జరగబోతుందా? అనే ఉత్కంఠ మొదలైంది. అదే సమయంలో జార్ఖండ్‌లో క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి.
జార్ఖండ్‌లో అధికారం కోల్పోతామనే భయం జేఎంఎం-ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిలో నెలకొంది. చంపయ్‌కు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆహ్వానం పంపకపోవడంతో.. ఈ గ్యాప్‌లో బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో ఎమ్మెల్యేలు జేజారిపోకుండా ఉండేందుకు అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రస్తుతం మద్ధతుగా ఉన్న 47 మంది ఎమ్మెల్యేలను చేజారిపోనివ్వకుండా జాగ్రత్త పడుతోంది.
హైదరాబాద్లో జార్ఖండ్ ఎమ్మెల్యేల క్యాంప్ ఖరారైంది. సాయంత్రం నాలుగు గంటలకు రాంచీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ రానున్నారు ఇండియా కూటమి ఎమ్మేల్యేలు. అందుబాబులో ఉన్న సుమారు 35 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు రానున్నట్లు తెలుస్తోంది. వాళ్లను బేగంపేట నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్‌కు తరలించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చంపయ్ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమే లేదని బీజేపీ అంటోంది. తగినంత మద్ధతు లేకపోవడమే అందుకు కారణమని చెబుతోంది.
జేఎంఎం మిత్రపక్షం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓ గిరిజన ముఖ్యమంత్రిని దర్యాప్తు సంస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ హింసిస్తోందని.. వాళ్ల కుట్రలు ఎక్కువ కాలం కొనసాగవని అన్నారాయన. హేమంత్‌కే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారాయన. జార్ఖండ్ అసెంబ్లీలో 81 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు బలం 41 స్థానాలు.