Wednesday, October 2, 2024
HomeUncategorizedజమ్మూకశ్మీర్‌లో గత 35 ఏళ్లలో అత్యధిక పోలింగ్‌

జమ్మూకశ్మీర్‌లో గత 35 ఏళ్లలో అత్యధిక పోలింగ్‌

Date:

జమ్మూకశ్మీర్‌లో గత 35 ఏళ్లలో అత్యధిక పోలింగ్‌ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 5 లోక్‌సభ స్థానాల్లో కలిపి 58.46 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపింది. 2019తో పోలిస్తే కశ్మీర్‌ లోయలో ఏకంగా 30 శాతం ఓటింగ్‌ పెరిగినట్లు, అభ్యర్థుల సంఖ్యలో కూడా 25 శాతం పెరుగుదల నమోదైనట్లు చెప్పింది. ఓటర్ల నుంచి ఈ స్థాయిలో మద్దతు లభించడం అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సానుకూల పరిణామమని భారత ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు.

కశ్మీర్ లోయలోని మూడు స్థానాల్లో కలిపి 50.86 శాతం ఓటింగ్ నమోదు కావడం.. ప్రజాస్వామ్య ప్రక్రియపై స్థానిక ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని ఎన్నికల సంఘం తెలిపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 19.16 శాతం ఓట్లు నమోదు కాగా.. ఈసారి 30 శాతం పెరిగినట్లు వెల్లడించింది. కశ్మీర్‌ లోయలోని శ్రీనగర్‌లో 38.49, బారాముల్లాలో 59.1, అనంత్‌నాగ్‌-రాజౌరీలో 54.84 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ మూడుచోట్ల గత మూడు దశాబ్దాల్లో ఇవే అత్యధికం. జమ్మూ ప్రాంతంలోని ఉధంపుర్‌లో 68.27, జమ్మూలో 72.22 శాతం పోలింగ్‌ నమోదైంది.