జనవరి 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 11.30 గంటలకు సమావేశానికి రావాల్సిందిగా అన్ని పార్టీల సభాపక్ష నేతలకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమాచారం అందించింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు నిర్వహించనున్న చివరి సమావేశాలు ఇవే. కీలక బిల్లులన్నింటికీ గత సమావేశాల్లోనే ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఏప్రిల్-మేలో జరిగే ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది.
పార్లమెంటు సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. ప్రభుత్వ అజెండాను విపక్షాలకు వివరించడం, తాము లేవనెత్తే అంశాలను విపక్షాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయి. సుహృద్భావ వాతావరణంలో సమావేశాలు కొనసాగేందుకు సహకరించాలని విపక్ష పార్టీలను కేంద్ర ప్రభుత్వం కోరే అవకాశం ఉంటుంది. ఈసందర్భంగా కొత్తగా తీసుకువచ్చిన భద్రతా ఏర్పాట్లను అన్ని పార్టీలకు వివరించనున్నట్లు సమాచారం.