Sunday, September 29, 2024
HomeUncategorizedఛత్తీస్‌గఢ్ అడవుల్లో తుపాకుల మోత

ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తుపాకుల మోత

Date:

ఛత్తీస్‌గఢ్ అడవులు తుపాకుల మోతతో దద్ధరిల్లాయి. ఎన్నికల ముందు కాంకేర్ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 18 మంది మావోయిస్టులు చనిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కాంకేర్ జిల్లా చోటేభైదియా పీఎస్ పరిధిలోని కల్పర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో భారీగా ఎకే47 గన్స్, ఇతర ఆయుధాలు లభ్యమయ్యాయి. మరికొందరు మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో.. సీఆర్ఎపీఎఫ్ దళాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.

మరో రెండు రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు పోలింగ్ మొదలవుతుంది. ఏప్రిల్ 19న దేశవ్యాప్తంగా 102 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. తొలిదశలో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ కూడా ఉంది. బస్తర్.. మావోయిస్టు ప్రాబల్యమన్న ప్రాంతం కావడంతో…అక్కడ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. సీఆర్‌పీఎఫ్ దళాలు ఛత్తీస్‌గఢ్ అడవులను జల్లెడు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇవాళ కాంకేర్‌లో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. అనంతరం ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి.

ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో ఒక సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.