Monday, September 23, 2024
HomeUncategorizedచండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

Date:

భారత సుప్రీంకోర్టు చండీగఢ్‌ మేయర్‌ ఎన్నికల ఫలితాలపై సంచలన తీర్పు వెలువరించింది. ఆప్‌ అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను తారుమారు చేసేందుకు ఉద్దేశపూర్వంగా వ్యవహరించారని స్పష్టంగా తెలుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ ఎన్నికలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఆ ఎన్నిక చెల్లుబాటు కాదని వ్యాఖ్యానించింది. రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్‌ వ్యవహరించిన తీరుపై తీవ్రంగా స్పందించింది.

జనవరి 30న నిర్వహించిన చండీగఢ్ మేయర్ ఎన్నికలో తగినంత సంఖ్యా బలం(16) లేకపోయినా బిజెపి మేయర్‌ అభ్యర్థి మనోజ్‌ సోంకర్‌ అనూహ్య విజయం సాధించారు. మెజారిటీకి అవసరమైన కౌన్సిలర్ల బలం(20) ఉన్నప్పటికీ ఆప్‌- కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థి కుల్దీప్‌ కుమార్‌ ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో పట్టపగలే మోసం జరిగిందని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ఎన్నికల అధికారి బ్యాలెట్‌ పత్రాలపై పెన్నుతో ఏదో రాసి.. వాటిలో కొన్నింటిని చెల్లకుండా చేశారని కాంగ్రెస్‌, ఆప్‌లు ఆరోపించాయి. ఆప్‌ కౌన్సిలర్ వేసిన పిటిషన్‌ను విచారించిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.

ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కొట్టివేత గుర్తు పెట్టిన బ్యాలెట్ పేపర్లను పరిశీలించింది. ‘ఈ బ్యాలెట్ పత్రాలు పాడైపోయినవని మీరు చెప్పారు. అది ఎక్కడో చూపించగలరా..?’ అంటూ మసీహ్‌ను ప్రశ్నించింది. ‘అవి ఆప్ అభ్యర్థి పేరిట వచ్చాయి. వీడియోలో కనిపిస్తున్నట్లు వాటిపై ఈ అధికారి గీత గీశారు ‘ అని వెల్లడించిన సీజేఐ.. ఆ పేపర్లను కోర్టులోని ఇరుపక్షాల న్యాయవాదులకు చూపించారు. అలాగే లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వీడియోను మరోసారి వీక్షించారు. మాసిహ్‌ చర్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీజేఐ.. లెక్కింపు వీడియోను మరోసారి ప్లే చేయమన్నారు. ‘అందరినీ ఈ వీడియో చూడనివ్వండి. జీవితంలో వినోదం మంచిదే. అయితే కౌంటింగ్ వీడియో మొత్తం వేయాల్సిన పనిలేదు. అంతా వేస్తే.. సాయంత్రం 5.45 గంటల వరకు ఇక్కడే ఉంటాం’ అని సరదాగా మాట్లాడారు.